కొత్తపల్లి, మే 15: కుక్కల దాడిలో మరణించిన మేకలకు పరిహారం ఇవ్వాలని యజమాని మేకల కళేబరాలతో మున్సిపల్ ఆఫీసు ఎదుట నిరసన తెలిపాడు యజమాని. కుక్కల నియంత్రణలో బల్దియా అధికారులు విఫలం కావడంతోనే రెండుసార్లు తన మేకలు మృత్యువాతపడ్డాయని ఆరోపించాడు. కొత్తపల్లికి చెందిన అజీజొద్దీన్కు చెందిన మేకల మందపై బుధవారం తెల్లవారుజామున కుక్కలు దాడి చేసి నాలుగు మేకలను చంపివేశాయి.
కొన్ని రోజుల క్రితం సైతం కుక్కల దాడిలో అతనికి చెందిన ఐదు మేకలు మరణించాయి. దీంతో ఆగ్రహించిన అజీజొద్దీన్ బుధవారం మేకల కళేబరాలతో కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశాడు. సుమారు 40 వేలు నష్టపోయాయని, వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంపై కమిషనర్ రమేశ్‌ను సంప్రదించగా, కుక్కల దాడిలో మేకలు మృతి చెందిన ఘటనపై గురువారం కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు. కలెక్టర్ అనుమతి తీసుకొని కుకలకు స్టెరిలైజ్ చేయిస్తామని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు హామీ ఇచ్చారు.