కార్పొరేషన్ మార్చి 16 : కరీంనగర్ నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల(Taxes) వసూళ్లలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్ రంగంలోకి దిగారు. నగరంలోని పలు డివిజన్ లలో పర్యటిస్తూ..రెవెన్యూ విభాగం అధికారులు సిబ్బందితో కలిసి ఆదివారం మొండి బకాయి దారుల నివాస గృహాలను సందర్శించారు. గత కొద్ది సంవత్సరాలుగా నగరపాలక సంస్థకు ఆస్తి పన్నులు చెల్లించని బకాయి దారుల నుండి పన్నులు కట్టించారు. ఇప్పటికే పలు మార్లు నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేకుండా పన్నులు చెల్లించని మొండి బకాయి దారుల షాపులకు తాళం వేయించారు. సకాలంలో నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు చెల్లించని బకాయి దారుల పై మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్వయంగా పలు డివిజన్ లలో బకాయి దారుల కు రెడ్ నోటీసులు జారీ చేసి పన్నులు చెల్లించాలని తెలిపారు. నగరంలోని రాంనగర్ లిటిల్ పార్కు తో పాటు మార్కెట్ రోడ్డులోని పలు లాడ్జ్ లు, కమర్షియల్ షాపులను సందర్శించి మొండి బకాయి దారులను పన్నులు చెల్లించాలని సూచించారు. మార్కెట్ రోడ్డులోని లక్ పతి కాంప్లెక్స్ కమర్షియల్ షాపులకు తాళం వేయించారు. ఈ సంధర్బంగా కమిషనర్ మాట్లాడుతూ..2024-2025 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుల చెల్లింపుల గడువు ముగుస్తున్నందున మొండి బకాయి దారుల పై మున్సిపల్ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేసిన స్పందించకుండా పన్నులు చెల్లించని వారి పై చర్యలు తీసుకోవాలన్నారు.
నల్లా కనెక్షన్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. బిగ్ డీఫాల్టర్స్ లిస్టును పేర్లతో సహా డివిజన్ లలో పబ్లిష్ చేయాలన్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహాకరించాలని కోరారు. పన్నులు చెల్లించని వారిపై నగరపాలక సంస్థ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వరూప రాణి, ఇంచార్జ్ ఆర్వో కలీమల్లా ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.