జగిత్యాల అర్బన్, మే 27 : పదమూడేళ్ల క్రితం జీపీ పరిధిలో పాసుపుస్తకం ద్వారా కొన్న 12 గుంటల స్థలానికి, మున్సిపల్లో ఆస్తిపన్నుకు సంబంధించిన నకిలీ పత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా ఒకేసారి 12 ఏండ్ల వీఎల్టీ టాక్స్ చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పన్నిన కుట్ర జగిత్యాల మున్సిపల్లో బయటపడింది. దీనిని పరిశీలిస్తే అనేక లోపాలు, అవకతవకలు జరిగినట్టు వెలుగులోకి వస్తున్నది. ఈ అవినీతి వెనుక ఓ ఉద్యోగితోపాటు మరికొందరు ఉన్నట్టుగా ఆరోపణలు వ్యక్తం కాగా, దీనిపై ‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ బాగోతం’ శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’ వచ్చిన కథనం సంచలనం సృష్టించింది.
కలెక్టర్ యాస్మిన్ బాషా సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. పూర్తి విచారణ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇరు వర్గాల వారికి నోటీసులు జారీ చేసి.. వారి దస్ర్తాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూ చించారు. ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ ఇరు వర్గాల వారికి నోటీసులు జారీ చేశారు. మూడురోజుల్లో వారి వద్ద ఉన్న పూర్తి డాక్యుమెంట్లు మున్సిపల్ కార్యాలయంలో అందించాలని సూచించారు. విచారణ చేపట్టి డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్న వారికి న్యాయం చేస్తానన్నారు. ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చిన వారి వీఎల్‌టీని రద్దు చేయడంతోపాటు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటు మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి కూడా స్పందించి.. ఇరు వర్గాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, మున్సిపల్ కార్యాలయంలో సమర్పించిన అసెస్మెంట్ పత్రాలను పరిశీలించాలని ఆదేశించారు.