కలెక్టరేట్, మార్చి 19 : జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఇతర ఆహారం తయారు చేసే కేంద్రాల్లో నాణ్యత తనిఖీలు(Food inspections) విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆహార కల్తీ, నాసిరకమైన ఆహారం తయారు చేయటం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆహార భద్రత విషయంలో అనుబంధ శాఖల సమన్వయంతో కొన్ని బృందాలను నియమించుకోవాలని, వాటి ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా హోటళ్లు, ఐస్ పాయింట్లు, పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేయాలని సూచించారు.
ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార వస్తువులు, వంటకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యతను కూడా పరిశీలించాలన్నారు. జిల్లాలోని చిరువ్యాపారుల వివరాలు సేకరించాలని, ఆహారం తయారు చేయటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆహార వ్యాపారం చేస్తున్న వారు నిబంధనలు పాటించకపోతే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహారం అమ్మకాలు సాగించేచోట పరిశుభ్రమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం వినియోగదారులకు అందజేయాలని స్పష్టం చేశారు.
పోలీస్ కమిషనర్ గౌస్ అలం మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆహార తయారీ కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. వంట గదులు, వాష్ ఏరియా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వీధి వ్యాపారులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించే పలు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, డిఆర్ వో వెంకటేశ్వర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్త్వో సుజాత, డిడబ్ల్యువో సబిత, డిఎస్ వో శ్రీనివాస్, డిఏవో భాగ్యలక్ష్మి, డిఈవో జనార్ధన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.