కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 04 : కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు చేపట్టనున్న నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశమందిరంలో గురువారం సంబంధిత విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోరైన్ రోడ్డు నిర్మాణ పనుల కోసం ఇప్పటికే మార్కింగ్ పూర్తైన నేపథ్యంలో విద్యుత్ పనులు, రోడ్డు పక్కన ఉండే బావుల పూడ్చివేత, చెట్లు కత్తిరించటంలాంటి పనుల్లో వేగంగా పూర్తి చేయాలన్నారు.
ప్రస్తుతమున్న రహదారిని వెడల్పు చేస్తున్న క్రమంలో ఆయా గ్రామాల్లో రోడ్డు నిర్మాణం కోసం గ్రామసభలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని ఆదేశించారు. అడ్డంగా ఉన్న విద్యుత్ స్థంభాలు తొలగించి, కొత్త లైను ఏర్పాటు చేయాలన్నారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నిర్మించనున్న ఈరోడ్డు కోసం జిల్లాపరిధిలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, జంగపల్లి తదితర గ్రామాల పరిధిలో రోడ్డునానుకుని ఉన్న వ్యవసాయ, ఇతర బావులను పూడ్చివేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, అటవీ శాఖాధికారి బాలమణి, ఆర్ అండ్ బి ఈఈ నర్సింహాచారితో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.