Collector Koya Sriharsha | పెద్దపల్లి రూరల్ ఆగస్టు 13 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పైలెట్ గ్రామంగా ఎంచుకున్న పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పాఠశాలపై పేరు లేక పోవడంతో అసలు ఈ భవనాలు ఏంటివి అని అక్కడున్న అధికారులను పరిచయం చేసుకుని ఉపాధ్యాయులుగా తెలుసుకున్న వారిని పాఠశాల గదులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు.
అనంతరం గ్రామంలో నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్ధి దారులను బిల్లులు చెల్లింపు అవుతున్నాయా..? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా..? అని అడిగి వివరాలు తెలుసుకుని గ్రామంలో మంజూరైన ఇండ్లను ఇల్లు నిర్మాణం చేసుకునే లబ్దిదారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో అందరు ఇండ్లు నిర్మించుకునేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్, ప్రత్యేకాధికారి, మండల వ్యవసాయశాఖ అధికారి కాంతాల అలివేణి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్ రావు, డీఈఈ పరమాచారి, ఏఈ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి అట్ల రాజ్ కుమార్ యాదవ్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.