జగిత్యాల నడిబొడ్డున ప్రకంపనలు సృష్టిస్తున్న వివాదాస్పద భూమికి సంబంధించి కలెక్టర్ వేసిన కమిటీ.. తన తుది నివేదికను సిద్ధం చేసింది. వారం నుంచి అధికారులు రికార్డులు తిరగేసి మరీ రూపొందించిన ఈ రిపోర్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే ఈ నివేదికపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆఫీసుల్లో భేటీలు కావడం, రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తున్న నేపథ్యంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నివేదికలో వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ రిపోర్టుతో వివాదానికి పుల్‌స్టాప్ పడుతుందా..? లేక 60 ఏళ్ల కథే పునరావృతం అవుతుందా..? అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
జగిత్యాల, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇరవై గుంటలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో, అర్బన్ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌తో కమిటీ వేసి, వీలైనంత తొందరగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ ఆదేశాలు ఇచ్చిన తర్వాత రెండు మూడు రోజులపాటు కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సంబంధింత శాఖల వారీగా రికార్డులు పరిశీలించినట్టు తెలిసింది. 1952లో మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న పరిస్థితులు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి 14 ఎకరాలకుపైగా భూమి కొనుగోలు, తర్వాత మున్సిపల్ తీర్మానం ద్వారా ఇరవై గుంటల స్థలం కేటాయింపు రికార్డులను పరిశీలన చేసినట్టు తెలిసింది.
అలాగే మున్సిపల్లో చేసిన తీర్మానాలు, 1964లో మొదలైన వివాదం, అప్పటి సబ్ కమిటీ నివేదిక.. ఇతర వివరాలను సేకరించినట్టు సమాచారం. అలాగే జగిత్యాల న్యాయస్థానంలో 1980 దశకంలో దాఖలైన కేసులు.. వచ్చిన తీర్పులు, 2004 మున్సిపల్ తీర్మానం, తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్‌లు రిట్ పిటీషన్లపై ఇచ్చిన తీర్పులను సేకరించి నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తున్నది. మున్సిపల్ పరిధి నుంచి వ్యాపార కేంద్రం కోసం తీసుకున్న అనుమతులు, తర్వాత అక్కడ నిర్మాణాలకు సంబంధించి కార్యాలయంలో దాఖలు చేసిన డ్యాకుమెంట్లు, వాటికి ఇచ్చిన పర్మిషన్లు, ఇంటి నంబర్లు, ఇంటిపన్ను వివరాలను సైతం పెట్టినట్టు తెలిసింది. ఇక న్యాయస్థానంలో వ్యాపారి కుటుంబసభ్యులు దాఖలు చేసిన భూమి కొనుగోలు పత్రాన్ని కూడా నివేదికలో పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు.
1945 నుంచి ఉన్న సేత్వార్, అందులో పట్టాదారుడి వివరాలు, విస్తీర్ణం, తర్వాత 1954-55 కాస్రా పహానిలో నమోదైన పట్టాదారు కాలం, కబ్జాదారు కాలం వివరాలను సేకరించినట్టు సమాచారం. 54-55 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాలను క్రోడీకరించి నివేదికను రూపొందించినట్టు పేర్కొంటున్నారు. అలాగే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి సైతం కొన్ని కీలకమైన వివరాలను తెప్పించుకున్నట్టు తెలుస్తున్నది. కమిటీ వేసిన మొదటి రెండు రోజుల్లోనే వివాదాస్పదస్థలంతోపాటు అక్కడి భవన సముదాయాలను సైతం రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కొలతలు వేసి రికార్డు చేశారు. కాగా, మంగళవారం మరోసారి జీపీఎస్ పద్ధతిలో స్థలాన్ని కొలిచి వివరాలను నమోదు చేశారు. మొత్తంగా వారం పాటు రికార్డులతో కుస్తీ పట్టిన అధికారులు, శాఖల వారీగా నివేదికలను ఉన్నతాధికారులకు నివేదించగా, వచ్చిన రికార్డులన్నింటినీ క్రోడీకరించి తుది నివేదికను కలెక్టర్‌కు అందజేసినట్టు సమాచారం.
రికార్డులు అసంపూర్ణమేనా..?
రికార్డులను పరిశీలించిన అధికారులు.. వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయనే అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు తెలిసింది. 70 ఏళ్ల క్రితం నాటి వ్యవహారం కావడంతో రికార్డులు సరిగా లేవన్న మాటలు వస్తున్నట్టు అధికారులు ప్రైవేట్ డిస్కషన్స్‌లో చెబుతున్నారు. జగిత్యాల మున్సిపల్ ఎస్టాబ్లిష్మెంట్ వివరాలే కార్యాలయంలో లేవని, ఇక అప్పటి మున్సిపల్ కమిటీల తీర్మానం, అనుమతుల వివరాలు ఎలా లభిస్తాయన్న అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అప్పటి డిటేయిల్స్ ఉంటే అన్నింటినీ పరిశీలించే అవకాశముండేందని పేర్కొంటున్నారు.
ఇక 1975 తర్వాత జరిగిన నిర్మాణాలు, వాటికి కేటాయించిన ఇంటి నంబర్లు, మున్సిపల్ మ్యుటేషన్ల వివరాలు సేకరిస్తున్నారు. అయితే రెవెన్యూ రికార్డుల విషయంలోనూ సరైన క్లారిటీ లేదంటున్నారు. దశాబ్దాలుగా అనేక మలుపులు తిరిగిన ఈ వ్యవహారంలో పూర్వం పనిచేసిన అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా రికార్డులు రాశారని ఆరోపిస్తున్నారు. కాస్రా పహాని పేరిట గతంలో రెవెన్యూ అధికారులు జారీ చేసి ఉన్నతాధికారులకు నివేదించిన సర్టిఫైడ్ కాపీలు సైతం సరిగా లేవని, అందులో అన్ని అవకతవకలే కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికంటే కీలకమైన కొనుగోలు పత్రంగా చెబుతున్న పత్రాన్ని తర్జుమా చేయాల్సి ఉంటుందని, అప్పుడే అన్ని వివరాలు తెలుస్తాయని నివేదించినట్టు తెలిసింది.
మ్యానేజ్ అయ్యారా…?
వారం పది రోజుల నుంచి సంచలనం సృష్టిస్తున్న భూ వివాదానికి సంబంధించిన విషయంలో అధికారులు ఇచ్చే నివేదికపై అనేక ఆరోపణలు, పుకార్లు షికారు చేస్తున్నాయి. అధికారులు మ్యానేజ్ అయ్యారా..? అన్న అనుమానాలను కొన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. రెండు మూడు రోజులుగా కొన్ని కీలకమైన కార్యాలయాల్లో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులు అధికారులను కలిసి చర్చలు జరిపినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఓ ఇద్దరు పరపతి పొందిన వ్యక్తులు అధికారితో చాలాసేపు చర్చించడం అందరినీ విస్మయానికి గురిచేసినట్టు తెలిసింది.
అలాగే ఒక ప్రముఖ వ్యాపారి అదే కార్యాలయానికి వెళ్లి, డ్యాకుమెంట్ల విషయంలో సేవలందించే వ్యక్తితో కలిసి అధికారితో చాలాసేపు రహస్య మంతనాలు చేసినట్టు తెలుస్తున్నది. వీటన్నింటినీ చూస్తే అధికారులు మళ్లీ మ్యానేజ్ అయ్యారా..? అన్న అనుమానాలు పట్టణవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఏడున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటు చేయబడి, ఆరు దశాబ్దాలుగా వివాదాస్పదం అవుతూ వస్తున్న ఈ వ్యవహారానికి ఇప్పటికైనా ఫుల్స్టాప్ పడుతుందా..? లేక మళ్లీ పూర్వ పరిస్థితే పునరావృతం అవుతుందా..? అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.