కొత్తపల్లి, జూన్ 3: విద్యార్థులకు శారీరక, మానసికోల్లాసం కలిగించడంతోపాటు క్రీడల ప్రాముఖ్యత తెలియజేసేందుకు కరీంనగర్ బల్దియా ఏటా వేసవిలో ఉచిత సమ్మర్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నది. జిల్లా యువజన, క్రీడాశాఖ సహకారంతో 2017 నుంచి ప్రతి సంవత్సరం నెలపాటు సుమారు వెయ్యి నుంచి 1,500 మంది విద్యార్థులకు పలు క్రీడాంశాల్లో శిక్షణ అందిస్తున్నది. ప్రతిరోజూ కోడిగుడ్డు, పాలు, అరటి పండ్లతోపాటు శిక్షణలకు అవసరమయ్యే క్రీడా సామగ్రికి సైతం ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లిస్తున్నది.
అయితే శిక్షణ అందించే కోచ్‌లకు గౌరవ వేతనం సక్రమంగా అందని పరిస్థితి నెలకొన్నది. 2022లో ఒక్కో కోచ్‌కు రూ.8వేలు ఇస్తామని చెప్పిన అధికారులు, క్యాంపు ముగిసిన పది నెలలకు రూ.5వేల చొప్పున 35 మంది కోచ్‌లకు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. 2023లో రూ.10వేలు ఇస్తామని, రెండేళ్లకు రూ.8వేల చొప్పున అంజేశారు. ఇక గత వేసవిలో శిక్షణ ఇచ్చిన 30 మంది కోచ్‌లకు అసలు ఎంత ఇస్తారో? ఎప్పడు ఇస్తరో? తెలియని అయోమయ పరిస్థితి ఉండగా, కోచ్‌లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో ప్రస్తుత వేసవి శిబిరం ముగియనుండగా.. ఇప్పటి వరకు ఇవ్వకపోవడంపై ఆగ్రహిస్తున్నారు. కరీంనగర్ బల్దియా అధికారులు వెంటనే స్పందించాలని, తమకు త్వరగా గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
గౌరవ వేతనం ఇస్తలేరు
సమ్మర్ క్యాంప్‌లో దాదాపు 1,500మంది విద్యార్థులకు వివిధ క్రీడాంశాల్లో సుమారు 30నుంచి 35మంది కోచ్లం శిక్షణ ఇస్తున్నాం. మాకు గౌరవ వేతనంగా అందించే మొత్తాన్ని ప్రతి సంవత్సరం ఆలస్యం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇలానే ఉంది. దీనిపై నగరపాలక అధికారులు దృష్టిసారించాలి.
– కంకటి అనూప్‌కుమార్, చెస్ కోచ్
సకాలంలో ఇవ్వాలి
విద్యార్థులకు ఉచితంగా సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించడం అభినందనీయం. ఈ విషయంలో నగరపాలక సంస్థ అధికారులను అభినందించాల్సిందే. అయితే నెలపాటు శిక్షణ అందిస్తున్న కోచ్‌లకు గౌరవ వేతనం సకాలంలో అందించకపోవడం సరికాదు. ఈ విషయంలో బల్దియా, జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోచ్‌లకు గతేడాది వేతనం ఇవ్వకపోవడం దారుణం. గౌరవ వేతనం తక్కువే అయినప్పటికీ సకాలంలో ఇవ్వాలి.
– నందెల్లి మహిపాల్, కరీంనగర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు