ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేటు దవాఖానలు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాయా? నకిలీ బిల్లులు సృష్టించి ఆసలు రోగికే తెలియకుండా సొమ్ము చేసుకున్నాయా? ఇందుకోసం అడ్డదారులు తొక్కాయా?.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఒకటి రెండు దవాఖానలు కాదు.. దాదాపు పది నుంచి పన్నెండు దవాఖానలు ఈ దందా నడిపినట్లు విమర్శలు వస్తుండగా.. ఈ అక్రమాలపై సీఐడీ పోలీసులు లాగుతున్న కూపీతో అనేక మంది పాపాలు బహిర్గతమవుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఒకటి, రెండుసార్లు వివిధ దవాఖానాల్లో సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు.. మంగళవారం మరోమారు విస్తృత తనిఖీలు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా జమ్మికుంటలోని సప్తగిరి దవాఖానలో సోదాలు నిర్వహిచిన సీఐడీ పోలీసులు భారీగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారని తెలుస్తోంది. ఆ మేరకు మరిన్ని వివరాలు లాగేందుకు సదరు దవాఖానకు సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా.. పెద్దపల్లి, కరీంనగర్‌లోని కొన్ని దవాఖానల్లోనూ తనిఖీలు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్న విషయం ప్రస్తుతం హాస్పిటల్వర్గాల్లో కలకలం రేపుతోంది.
చిన్న రోగాలకే వేల కొద్ది బిల్లులు వేసి పీల్చి పిప్పి చేసే.. పలు ప్రైవేట్ దవాఖానలు చివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)ని కూడా వదిలి పెట్టలేదు. ఫేక్ బిల్లులు సృష్టించి అందినకాడికి దోచుకున్నాయి. ఈ వ్యవహారం రూ.కోట్లలోనే ఉంటుందని తెలుస్తోంది. ఆపన్నలకు అండగా నిలువాలన్న లక్ష్యంతో సీఎంఆర్ఎఫ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. దరఖాస్తు చేసుకున్న రోగుల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సాధ్యమైన మేరకు ప్రభుత్వం సహాయం అదించింది. ఈ క్రమంలో చాలా మంది రోగులు.. ఎమ్మెల్యేలను కలిసి సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు సైతం వాటిని మంజూరు చేయించి, చెక్కులను బాధితులకు అందించారు. అయితే, సీఎంఆర్ఎఫ్ ఉదారతను అవకాశంగా మలుచుకున్న కొన్ని ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు ఫేక్ బిల్లులు సృష్టించి.. నిధులు కొల్లగొట్టారని తెలుస్తోంది. నిజానికి ఈ ఆరోపణలు గతంలోనే రాగా, తీవ్రంగా పరిగణించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీఐడీ పోలీసుల ద్వారా విచారణకు ఆదేశించింది. ఆ మేరకు.. సాగుతున్న విచారణ ప్రస్తుతం తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు పది, పన్నెండు ప్రైవేట్ దవాఖానలు ఈ దందాకు పాల్పడ్డాయని తెలుస్తోంది. ఆరోపణలు వచ్చిన దవాఖానాల్లో గతంలోనే సీఐడీ అధికారులు విచారణ జరిపారు. ఆ మేరకు వివరాలు సేకరించారు. వాటి అధారంగా కూపీ లాగుతున్న నేపథ్యంలో ఒక్కో దవాఖాన అక్రమాలు ఆధారాలతో సహా బహిర్గతమవుతున్నాయి.
గతంలో సేకరించిన పలు ఆధారాలను పరిగణలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు.. తుది అంకంలో ఉన్నట్లు తెలుస్తోంది. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా.. సదరు పోలీసు అధికారులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే.. మంగళవారం పెద్దపల్లి, కరీంనగర్‌లోని పలు దవాఖానాల్లోనూ తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు.. జమ్మికుంటలోని సప్తగిరి దవాఖానలోనూ సోదాలు నిర్వహించారు. ఇద్దరు సీఐలతోకూడిన బృందం… కొన్ని గంటల పాటు.. ఈ దవాఖానలో రికార్డులను పరిశీలించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఒకే కేసు నంబర్‌తో సీఎంఆర్ఎఫ్ కొల్లగొట్టినట్లుగా గుర్తించిన పలు రికార్డులను సైతం సీజ్ చేశారని తెలుస్తుండగా.. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. మంగళవారం జరిగిన సోదాల్లో ఈ దవాఖానలో భారీగా అక్రమాలు జరిగినట్లు సమాచారం అందుతుండగా.. అదుపులోకి తీసుకున్న వ్యక్తి ద్వారా మరింత కూపీ లాగుతున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ దవాఖాన ఇప్పటికే పలు వివాదాలకు కేరాఫ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో.. మళ్లీ సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన అక్రమాలు ఇదే దవాఖానలో వెలుగు చూడడంతో ఆసలు ఈ దవాఖాన పరిధిలో ఏమి జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదుపులోకి తీసుకున్న వ్యక్తితోపాటు దవాఖానకు చెందిన పలువురు నిర్వాహకుల నుంచి వివరాల రాబట్టిన సీఐడీ అధికారులు లిఖితపూర్వకంగా కూడా స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. సీఐడీ పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఈ దవాఖానపై సీరియస్ యాక్షనే ఉంటుందని సమాచారం. కాగా. పెద్దపల్లితోపాటు.. కరీంనగర్ పట్టణంలోని కొన్ని దవాఖానలపైనా సీఐడీ పోలీసులు మంగళవారం ఏక కాలంలో సోదాలు చేశారని తెలుస్తోంది. ఇందులోనూ మూడు దవాఖానల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. మరోవైపు.. ఇదే కోణంలో మరికొన్ని దవాఖానలు ఉన్నాయని, వాటి నుంచి కూడా వివరాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఒక అధికారి తెలిపారు. అయితే, ఓవరాల్‌గా చూస్తే.. సీఎంఆర్ఎఫ్ పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తుండగా.. సీఐడీ పోలీసులు నిక్కచ్చిగా ముందుకు వెళ్తారా? లేక ఇంకా ఎవరి ఒత్తిళ్లకైనా తలొగ్గుతారా? అన్నది మున్ముందు తేలుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. సీఎంఆర్ఎఫ్ కొల్లగొట్టిన ప్రైవేటు దవాఖానలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.