ముకరంపుర, సెప్టెంబర్ 27: ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో ఉద్యోగుల బదిలీకి సంబంధించిన మార్గదర్శకాలను సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం జారీ చేశారు. ప్రస్తుత ఉద్యోగంలో 2024 జూన్ 30 నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల్లో 50 శాతం మందిని బదిలీ చేసేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డివిజనల్ క్యాడర్ స్థాయిలో లైన్ ఇన్స్పెక్టర్ వరకు డివిజన్ అధికారి ప్రస్తుతం ఉన్న సెక్షన్ నుంచి వేరొక సెక్షన్‌కు బదిలీ చేయనున్నారు.
సబ్ ఇంజినీర్లు, అకౌంట్స్, ఫోర్ మెన్, ఎస్ఎల్ఐ, ఇతర ఉద్యోగులను సర్కిల్ స్థాయిలో ఎస్సీ బదిలీ చేయనుండగా, ఆపై ఉద్యోగులు, అధికారులను సీఎండీ బదిలీ చేయనున్నారు. బదిలీ జాబితాలో ఉన్న ఉద్యోగులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. డిస్కం, సర్కిల్ స్థాయిల్లో యూనియన్, అసోసియేషన్ల ప్రతినిధులకు మినహాయింపును ఇచ్చారు. ఉద్యోగులైన భార్య, భర్తలతో పాటు 2025 సెప్టెంబర్ 30లోగా విరమణ చేసే ఉద్యోగులకు, వితంతువు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, 70 శాతం వైకల్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపును ఇచ్చారు. ఈ నెల 28లోగా బదిలీకి అర్హులైన ఉద్యోగుల జాబితా రూపొందిస్తారు. 30న అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 4లోగా ఉద్యోగులు బదిలీల అక్టోబర్ 7న బదిలీల పోర్టల్‌లో బదిలీల దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు. 8న బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుంది. బదిలీ అయిన ఉద్యోగులు 9వ తేదీలోగా రిలీవ్ కావాల్సి ఉంటుంది.