Koppula Eshwar | ధర్మారం, సెప్టెంబర్ 4 : రాష్ట్రంలో సీఎం రేవంత్ వెయ్యి రోజుల పాలన అంతా మోసపూరితమేనని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజా పాలన పేరుతో మోసపూరిత పాలన చేస్తున్నాడని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలలో విఫల పాలనను నిరసిస్తూ ఈశ్వర్ ఆధ్వర్యంలో కరీంనగర్ -రాయపట్నం రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల మహిళలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి1000 రోజులు గడిచినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వాగ్దానాలను హామీలను నెరవేర్చకుండా మోసం చేశాడని విమర్శల వర్షం కురిపించారు.
ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలలో తులం బంగారం, మహిళలకు నెలకు రూ. 2,500 భృతి, విద్యార్థినులకు ఉచిత స్కూటీల పంపిణీ వంటి కీలక హామీలను పక్కనబెట్టి ప్రజలను మోసం చేశారని ఈశ్వర్ ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో అమలు చేసి ఎంతో ఆదరణ పొందిన బీసీ బంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, పెన్షన్ల పెంపు వంటి ప్రజాకర్షక పథకాలను నిలిపివేసి ప్రభుత్వం పేదల నట్టేట ముంచిందని ఆయన విమర్శించారు. దివ్యాంగులకు, వృద్ధాప్య పింఛన్లు పెంచుతామని ప్రకటించి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి బకాయి ఉందనే విషయం గుర్తులేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి నెలా మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, మూడేళ్ల కాలానికి సంబంధించి ప్రతి మహిళకు సుమారు రూ.82,500 వరకు బాకీ ఉన్నారని ఆయన వివరించారు.
గతంలో బీఆర్ఎస్ పాలనలో కంటే రైతుబంధు సహాయం ఎక్కువగా ఇస్తాడని నమ్మి కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే అందులో భూమి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు జమగాక నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన అందులో అభివృద్ధి శూన్యమని, కేవలం ప్రకటనలకే పరిమితమై పాలన కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.కేసీఆర్ పాలనలో రైతు బంధు, ఉచిత విద్యుత్, సాగునీరు మరియు 94,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించడం వలన తెలంగాణలో ధాన్యం 36 లక్షలు క్వింటాళ్ల నుంచి కోటి క్వింటాళ్ల వరకు ఉత్పత్తి పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
బిఆర్ఎస్ హయాంలో ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి రూ.1.20 లక్షల వరకు వెచ్చించి అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్య అందించేలా గురుకుల వ్యవస్థను బలోపేతం చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తూ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు.ప్రస్తుత ప్రభుత్వంలో సరైన పర్యవేక్షణ లేక పాఠశాలల్లో మౌలిక వసతులు క్షీణించాయని, అడ్మిషన్లు తగ్గిపోయి వేలాది బడులు మూతపడే పరిస్థితికి వచ్చాయని ఆరోపించారు. తుమ్మడి హెట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం వల్లనే నాడు సీఎం కేసీఆర్ మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగునీటిని అందించే రైతును ఆదుకున్నాడని ఆయన గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేవలం కొన్ని పిల్లర్లు కుంగాయని మూడేళ్ల నుంచి నీటిని ఎత్తిపోయకుండా రైతులను అరిగోస పెడుతున్నాడని ఈశ్వర్ ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తుమ్మడి హెట్టి వద్ద ప్రాజెక్టు పెడతామని కొత్త నాటకానికి తెరలేపారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఈశ్వర్ స్పష్టం చేశారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు జవాబు చెప్పాలి
ధర్మపురిని నియోజకవర్గంలో మూడేళ్ల పాలనలో ఏమి అభివృద్ధి చేశాడో రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు ప్రగతి నివేదిక పంపిస్తానని అంటున్న లక్ష్మణ్ కుమార్ ఏ ఏ అభివృద్ధి పనులు చేశాడో చెప్పాలని ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ధర్మపురి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించగా అందులో తమ ప్రభుత్వం హాయంలోనే రూ.60 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని అన్నారు. మిగతా రూ.40 కోట్లకు ఇప్పుడు టెండర్లు పిలిచి తామే అభివృద్ధి చేస్తున్నామని లక్ష్మణ్ కుమార్ గొప్పలు చెప్పుకుంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లోని రూ.10,500 ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పంతో నంది రిజర్వాయర్ కు అనుబంధంగా లింకు కాల్వ నిర్మిస్తే సాగునీటిని ఎందుకు విడుదల చేయడం లేదో మంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. బొమ్మరెడ్డిపల్లి ఎస్సారెస్పీ ఉపకాల్వ విస్తరణకు రూ.19 కోట్లు, కొత్తపల్లి శివారులో మ్యాదరి కండి చెరువు నిర్మాణానికి రూ.15 కోట్లు తమ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేస్తే ఇప్పటికీ వాటిని ఎందుకు పూర్తి చేయడం లేదని ఈశ్వర్ ప్రశ్నించారు. ధర్మారం మండల కేంద్రంలో కరీంనగర్ – రాయపట్నం రహదారిని 4 లేన్ల రహదారిగా విస్తరించడానికి రూ.19 కోట్ల నిధులను మంజూరు చేయిస్తే ఇప్పుడు వాటికి కొత్త టెండర్ పెట్టి తానే నిధులు మంజూరు చేయించామని మంత్రి లక్ష్మణ్ కుమార్ కొత్త నాటకానికి తెర లేపారని ఈశ్వర్ విమర్శించారు.
రోడ్డుపైనే వంటావార్పు : ప్రజలతో కలిసి భోజనం చేసిన కొప్పుల
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విఫల పాలనను నిరసిస్తూ మాజీ మంత్రి ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు కరీంనగర్- రాయపట్నం రహదారిపై చేపట్టారు. రోడ్డు పక్కన భోజనాలు వండారు. స్వయానా మాజీ మంత్రి ప్రజలకు, పార్టీ నాయకులకు కార్యకర్తలకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలపై ధర్మారం మాజీ ఎంపీపీ ముత్యాల కరుణ శ్రీ ఆధ్వర్యంలో మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి తోపాటు ఇతర నాయకులను ఈశ్వర్ ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమానికి పార్టీ మాజీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా నంది మేడారం చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, మాజీ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ధర్మారం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు, వివిధ గ్రామాల సర్పంచులు మోతే కనకయ్య మంద శ్రీనివాస్ , సంక సాని సౌజన్య సతీష్ రెడ్డి,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి గొల్లపల్లి, పెగడపల్లి మాజీ జెడ్పిటిసిలు గోస్కుల జలంధర్, తాటిపర్తి శోభారాణి, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు పాకాల రాజయ్య ,వివిధ మండలాల ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, ఏలేటి కృష్ణారెడ్డి, ముల్కల గంగారాం, పత్తిపాక వెంకటేష్, అయ్యోరి రాజేష్, ఆయా మండలాల పార్టీ మాజీ మండల అధ్యక్షులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.