వేములవాడ, ఆగస్టు 31 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు విమర్శలకు తావిస్తున్నది. వేములవాడ రాజన్న ఆలయానికి బడ్జెట్లో నిధులు కేటాయించినందున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు హైదరాబాద్‌లోని సీఎం కార్యాలయానికి శుక్రవారం వెళ్లి వేదోక్త ఆశీర్వచనం చేసి, రాజన్న శేష వస్త్రం, ప్రసాదం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
అంతవరకు బాగానే ఉన్నా సీఎం షూ ధరించి రాజన్న ప్రసాదం తీసుకోవడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాజన్న ప్రసాదం, ఆశీర్వచనాన్ని అందిస్తున్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరును భక్తులు తప్పుపడుతున్నారు. అపచారం చేశారంటూ ఆగ్రహిస్తున్నారు. భక్తి శివుడి మీద ఉందో లేదో తెలియదు కానీ, చిత్తం మాత్రం చెప్పుల మీదే అన్నట్టు ఉందని విమర్శిస్తున్నారు.