తెలంగాణచౌక్, ఆగస్టు 26 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నించారు. ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీ తర్వోత పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
వెల్ఫేర్ బోర్డులను రద్దు చేసి కార్మికులు సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ) ఆర్టీసీ కార్మిక విభాగమైన స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో నిరసనకు దిగారు. అంతకు ముందు యూనియన్ రాష్ట్ర వైస్ చైర్మన్, జిల్లా ఇన్చార్జి జక్కుల మల్లేశం ఆధ్వర్యంలో ఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసన చేయడానికి చేరుకోగా, పోలీసు సెక్యూరిటీ గార్డులు అనుమతి ఇవ్వలేదు.
దీంతో తమ ప్రభుత్వ పాలనలో శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటురన్నారని వన్ టౌన్ సీఐ సిరిలాల్తో వాగ్వాదానికి దిగారు. సమస్యలను ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లేందుకు మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నా అనుమతి ఇవ్వడంలేదని తెలిపారు. అందుకే నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. అయినా, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కనీసం మీడియాతో మాట్లాడనివ్వాలని కోరారు. దీంతో పోలీసుల సమక్షంలో జక్కుల మల్లేశం విలేకరులతో మాట్లాడారు.
అధికారులు కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డ్యూటీ చార్ట్‌లో సంతకం చేయకముందే బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేస్తున్నారని, మద్యం సేవించకున్నా ఘగర్, బీపీ లాంటి మందులు వాడినప్పుడు బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పర్సంటేజీ చూపేడితే డ్రైవర్లను సస్పెండ్ చేస్తున్నారని తెలిపారు. గతంలో ఇలాంటి సంఘటనతో శ్రీనివాస్‌రెడ్డి అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు.
కంట్రోలర్ వద్ద బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి సరిపడా బస్సులేక పోవడంతో 60 మంది ఎక్కాల్సిన బస్సులో 100కు పైగా ప్రయాణికులు ఎక్కుతున్నారని, టికెట్ ఇచ్చే విషయంలో చిన్న పొరపాటు జరిగినా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అన్ని కేటగిరీల్లో సస్పెండ్ అయిన ఉద్యోగుల మీద త్వరగా విచారణ పూర్తి చేసి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు కార్మికులపై వేధింపులను ఆపాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో యూనియన్ రీజియన్ అధ్యక్షుడు టీపీ రెడ్డి, కార్యదర్శి ఎన్ఆర్ రాజు, కార్మికులు పాల్గొన్నారు.