కోరుట్ల గడ్డమీద సీఎం కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వంద శాతం నిలబెడుతా. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలో కేసీఆర్‌ను ఒక వైద్యుడిగా దగ్గరి నుంచి చూశా. 2009లో చావునోట్లో తలకాయపెట్టిన కేసీఆర్ సార్ పోరాట పటిమను చూసి అప్పుడే ఆయన కింద పనిచేయాలని అనుకున్నా. వరద కాలువ తెలంగాణ రాక ముందు ఎడారిలా ఉండేది. రాష్ట్రం వచ్చాక జీవనదిలా మారింది. ఈ ఘనత ముఖ్యమంత్రిదే. నేను ఇదే గడ్డపై పుట్టిన బిడ్డను. పరాయి ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కాదు. 20 ఏండ్లుగా మీతో కలిసి ఉన్నా.
నన్ను ఆశీర్వదించి గెలిపించండి. నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా. అందుబాటులో ఉండి సేవలందిస్తా. ఈ ప్రాంతంలో ఎంపీగా ఉన్న వ్యక్తి చేసిన అభివృద్ధి ఏమీలేదు. బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. బీడీ కార్మికులు దయనీయమైన పరిస్థితులు ఎదురొంటున్న సమయంలో సీఎం కేసీఆర్ వారికి నెలకు 2,016 చొప్పున పింఛన్ ఇస్తూ ఒక పెద్దన్నలా సహాయ పడుతున్నరు. కోరుట్ల నియోజకవర్గంలో ఇంకా కొందరు పింఛన్ల కోసం వేచిచూస్తున్నారు. వారికి కూడా పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నా. మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో డిగ్రీ పూర్తి చేసే యువతకు సౌకర్యంగా పీజీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడం వల్ల రైతుల కోసం ఒక ఉద్యాన వన కళాశాలను ఏర్పాటు చేయాలని నా విజ్ఞప్తి.
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
్రప్రజా సేవ కోసం వస్తున్న డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను పెద్ద మనసుతో దీవించండి. 25 ఏండ్లుగా ప్రజాజీవితంలో ఉన్నా. నన్ను మీ బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా ఆశీర్వదించి జడ్పీటీసీగా, ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. జీవితంలో మీరు నాకిచ్చిన అవకాశం మర్చిపోను. మీ రుణం తీర్చుకోలేనిది. పెద్దాసుపత్రిలో వైద్యుడిగా ఉన్న నా బిడ్డ డాక్టర్ సంజయ్ ప్రజాజీవితంలోకి వచ్చిండు. నన్ను ఆదరించినట్లే నా బిడ్డను దీవించి ఎమ్మెల్యేగా గెలిపించండి.
అతను పట్టుదల కలిగిన మనిషి. తండ్రికి తగ్గ తనయుడిగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్‌వన్‌గా నిలబెడతాడు. నేను కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటా. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి గనుక రాజకీయ లబ్ధికోసం ఎవరెవరో వస్తరు, ఏదేదో చెప్తరు నమ్మి మోసపోవద్దు. 2014కు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లుండె? వచ్చినంక ఎట్లుంది? అని ఆలోచించాలి. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాలి. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో డాక్టర్ సంజయ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలి.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నాయకులు ధరణిని తీసేస్తరట. ఎందుకు మళ్లీ దళారుల రాజ్యం కోసమా..? ధరణిని తీసేస్తే రైతు బంధులు డబ్బులు ఎట్ల వస్తయి? రైతు బీమా డబ్బులు ఎట్ల వస్తయి? ఒకసారి ఆలోచించాలి? ధరణి ఉండాలా..? వద్దా..? గ్రామాలల్ల దీనిమీద చర్చపెట్టాలి. ఇంకో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతడు. రైతు బంధు ఇచ్చి కేసీఆర్ బేకారు చేత్తండు అని. రైతు బంధు దుబారనా..? ఉండాలె కదా.. మళ్లీ మీ దయతో బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. ఎకరానికి ఇప్పుడిచ్చే 10వేలను 12వేలు చేసుకుంటం. ఏడాదికి వెయ్యి పెంచుకుంటూ ఎకరానికి తర్వాత 16వేలు అయితది. రాష్ట్రంలోని 93లక్షల పేద కుటుంబాలకు వచ్చే మార్చి తర్వాత సన్నబియ్యం ఇస్తం. ఇలా అనేక కార్యక్రమాలు మ్యానిఫెస్టోలో పెట్టిన.
– ముఖ్యమంత్రి కేసీఆర్
కరీంనగర్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జగిత్యాల (నమస్తే తెలంగాణ): కోరుట్లలో అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జనం అశేషంగా తరలివచ్చారు. 63వ జాతీయ రహదారి పక్కన పెద్దగుండు ప్రాంతంలో శుక్రవారం బీఆర్ఎస్ జగిత్యాల అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చారు. పల్లె, పట్టణం అన్న తేడాలేకుండా కదిలి వచ్చారు. నిజానికి ముఖ్యమంత్రి సాయత్రం నాలుగు గంటలకు వస్తారని ముందుగానే సమాచారం ఇచ్చినా.. జనం మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
ఎండ, ఉక్కపోతను లెక్క చేయకుండా కేసీఆర్ రాక కోసం ఎదురు చూశారు. ఒక దశలో జగిత్యాల-నిజామాబాద్ ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోగా, ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా కనిపించారు. చాలా మంది మైదానం బయటే ఉండిపోయారు. సభా ప్రాంగంణంలోకి వెళ్లే పరిస్థితి లేక బస్సులు, ఆటోల్లోనే ఉండి ప్రసంగం ఆసక్తిగా విన్నారు. అలాగే, ఈ బహిరంగ సభ కోరుట్ల నియోజకవర్గంలోనే అతి పెద్దది అంటూ స్థానికులు ముచ్చటించుకోవడం కనిపించింది. అంటే సభకు ఏ మేరకు జనం తరలి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ అంచనాలకు మించి రావడం, సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నెలకొన్నది. అంతేకాదు, తరలి వచ్చిన జనాన్ని చూసిన నేతలు.. బీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేయడం సభ వద్ద కనిపించింది.
ఎలక్షన్లు వస్తయి.. పోతయి. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితరు. ప్రతి పార్టీకి ఒక అభ్యర్థి ఉంటడు. ఆ అభ్యర్థి గుణ, గణాలను చూడాలి. ఎమ్మెల్యే గెలుపు ద్వారా రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడుతది. ఆ ప్రభుత్వమే రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తది. మీరు కింది మీది చేస్తే మోసం జరుగుతది. అందుకే అభ్యర్థుల వెనుకాల ఉండే ఆ పార్టీల చరిత్ర తెలుసుకోవాలి. ప్రజలు, రైతులు, పేదల కోసం ఏం చేశాయో చూడాలి. ఎందుకంటే మంచి చెడ్డ గమనించకుండా గుడ్డిగా ఓటేస్తే, అక్కరకు రాని ప్రభుత్వాలు వస్తయి. తద్వారా ఒకరిద్దరి భవిష్యత్ కాదు, తెలంగాణ భవిష్యత్ అంధకారం అవుతుంది. మీ అందరినీ కోరేది ఒక్కటే. ప్రజాస్వామ్య పరిణితిని ప్రదర్శించాలి. మనం ఎవరికి ఓటు వేస్తున్నామో ఆలోచించాలి. ఎవరుంటే మంచిది. ఎవరు ఏంది? ఎవరు ఏం చేశారు? అని చూసి వేస్తే మేలు జరుగుతుంది.
– ముఖ్యమంత్రి కేసీఆర్
రైతు బంధు ఎట్లా వస్తంది. ఎవరికీ దరఖాస్తు పెట్టాల్సిన పనిలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు. అక్కడ మేం బ్యాంకులో డబ్బులు వేస్తే ఇక్కడ సెల్ఫోన్లన్నీ టింగ్టింగ్ మంటూ మోగుతయి. ఈ రోజు రైతుల అప్పులు తీరుతున్నయి. పంట పెట్టుబడికి బ్యాంకు రుణం కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. రెండు సార్లు రైతుల రుణాలు మాఫీ చేసినం. లక్ష రూపాయల లోన్లు మాఫీ చేసినం. ఆపై చేస్తావుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయింది. నేను మీకు హామీ ఇస్తా ఉన్న. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత లక్షపైన ఉన్నోళ్లకు కూడా రుణమాఫీ చేస్తం.
– ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పందొమ్మిది నిమిషాలపాటు ప్రసంగించారు. స్థానిక అంశాలను ప్రస్తావిస్తూనే.. ఆద్యంతం తన ప్రసంగంతో ఆలోచింపజేశారు. యాభై ఎనిమిదేళ్ల సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయం, కరెంటు, సాగు, తాగునీటి కోసం పడ్డ కష్టాలు.. రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమ ఫలాల గురించి వివరించారు. స్వరాష్ట్రంలో తీరిన సాగు, తాగునీటి ఇక్కట్లు, ముఖ్యంగా తొలిగిన కరెంటు చీకట్లు, ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలపై గ్రామాల్లో చర్చపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఓటు వేసేముందు అభ్యర్థి గుణగణాలను చూడాలని, పార్టీ చరిత్ర గురించి తెలుసుకోవాలని సూచించారు. ఆగమై ఓటు వేస్తే అక్కరకు రాని ప్రభుత్వాలు వస్తాయని, తద్వారా తెలంగాణ భవిష్యత్ అంధకారమవుతుందని హెచ్చరించారు.
ఆలోచించి ఓటు వేయాలని, ఎమరుపాటుగా ఉండొద్దని సూచించారు. గతంలో తాను కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసిన చేశారు. తాను చిన్నప్పుడు బీడీలు చేసే ఇంట్లోనే పెరిగానని, వాళ్ల కష్టాలు, కన్నీళ్లు తెలుసునని చెప్పుకొచ్చారు. అందుకే దేశంలోని 19 రాష్ర్టాల్లో బీడీలు చేసే మహిళలు ఉన్నా.. ఒక్క తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చి ఇస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 పింఛన్‌ను ఐదు వేలు చేస్తామని ప్రకటించారు. డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఇంకా ఎమ్మెల్యే కాలేదు కానీ, దుకాణం పెట్టడని చమత్కరిస్తూనే.. ఆయన కోరిక కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. దీంతో సభికులు చప్పట్ల మోత మోగించారు. ఉద్యమ సమయంలో బండలింగాపూర్‌లో పల్లెనిద్ర చేసినప్పుడు మీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వచ్చి, బండలింగాపూర్‌ను మండలం చేయాలని ప్రజలు అడుగుతున్నారని చెప్పడంతో వెంటనే మండలం చేశామని గుర్తు చేశారు.
వరదకాలువ, కాకతీయ కాలువలపై గతంలో మోటర్లు పెడితే ఎన్ని తిప్పలు ఉండెనో గుర్తు చేసుకోవాలని చెబుతూనే.. ఇప్పుడు ఎవడైనా వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారా..? అంటూ ప్రశ్నించడంతో ‘లేదు.. లేదు’ అంటూ ప్రజలంతా సమాధానమిచ్చారు. కొంత మంది కాంగ్రెస్ నాయకులు రైతుబంధును దుబారా ఖర్చు అంటున్నారని, ఈ పరిస్థితుల్లో రైతు బంధు ఉండాలా..? వద్దా..? ఉండాలనే వారు చేయి లేపాలని ముఖ్యమంత్రి కోరగా.. సభికులంతా చేతులెత్తి ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు. 24 గంటల కరెంటు వృథా అంటున్నారని, ఉండాలా..? వద్దా? చెప్పాలని ప్రశ్నించగా మరోసారి చేతులు పైకెత్తి ఉండాలని చెప్పారు.
అనేక సార్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయని పార్టీలు ఇప్పుడు మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాయని, వాటితో జాగ్రత్త ఉండాలంటూ అప్రమత్తం చేశారు. కాదని వాళ్లని నమ్మితే వైకుంఠం ఆటల పెద్దపాము మింగినట్లు అయితదని, మళ్లీ మొదటికి వస్తదిని, ‘తీర్థాం పోదాం తిమ్మక్క అంటే.. నువ్వు గుళ్లే, నేను సల్లె’ అన్నట్టు కథ ఉంటుందని చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకున్నది. సంజయ్ డాక్టర్‌గా కోట్లు సంపాదించే అవకాశం ఉందని, అదికాదని తన సొంత గడ్డకు సేవచేయాలన్న లక్ష్యంతో వచ్చారని, అతన్ని ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కోరగా ప్రజానీకం చప్పట్లతో జై కొట్టింది.
కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ సభలో తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడిన తర్వాత తనదైన శైలిలో ప్రసంగించారు. రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలో కేసీఆర్‌ను ఒక వైద్యుడిగా దగ్గరి నుంచి చూశానని, చావునోట్లో తలకాయపెట్టిన ఆయన పోరాట పటిమను చూసి అప్పుడే సార్ కింద పనిచేయాలని అనుకున్నానని ఉద్యమ రోజులను గుర్తు చేశారు. ‘నేను ఇదే గడ్డపై పుట్టిన మీ బిడ్డను. ఇక్కడి బిడ్డ కావాలా..? లేక ఇతర పరాయి వారు కావాలా..?’ అంటూ వేసిన ప్రశ్నలకు.. ‘ఇక్కడి వారే’ కావాలంటూ ప్రజలు విజయ సంకేతం చూపుతూ సమాధానం చెప్పారు. ‘20 ఏండ్లుగా మీతో కలిసి ఉన్నా. నన్ను ఆశీర్వదించి గెలిపించండి. నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా’ నంటూ విజ్ఞప్తి చేయగా, సభికులంతా జైకొట్టారు.