గొల్లపల్లి, ఆగస్టు 27: ‘కాంగ్రెస్ మాటలన్నీ బూటకం. రాష్ట్రంలో 50 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేయలే. అభివృద్ధిలో తెలంగాణను వెనక్కినెట్టేసింది. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అధి కారం కోసం చేతకాని హామీలన్నీ ఇస్తున్నరు. అ యినా వాళ్లది అభివృద్ధి పార్టీ కాదు. పైరవీల పా ర్టీ. ఎన్నికల ముందు నమ్మిస్తరు.. తర్వాత ముం చుతరు’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ‘నాడు అంధకారంలో ఉన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపి, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే ఆ పార్టీ జీర్ణించుకోలేపోతున్నది. సాగుకు మూడు గంటల కరెంట్ చాలు అన్న కాంగ్రెస్ కావాలా..? మూడు పంటలకు నీళ్లు, విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ కావా లా.. మీరే ఆలోచించుకోవాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్ ఇస్తామంటున్నరు. వారి పాలిత రాష్ర్టాల్లో పింఛన్ ఎంత ఇస్తున్నరో చెప్పాలని’ ప్రశ్నించారు. గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లిలో రూ.2.30 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం కొప్పుల మాట్లాడారు. సబ్బండవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ సర్కారు ముందుకుసాగుతున్నదని, తొమ్మిదేండ్ల పాలనలో దశాబ్దాల నాటి అభివృద్ధి చేసిందన్నారు. రైతు బంధు కింద ఎకరాకు రూ.5వేల చొప్పున సాయం అందిస్తున్నామని, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, పంటకు సరిపడా నీళ్లు అందిస్తూ అండగా నిలుస్తున్నామన్నారు. అనుకోని పరిస్థితుల్లో రైతు మృతిచెందితే కుటుంబాలు ఆగంకావద్దని రైతు బీమా అందిస్తున్నట్లు వివరించారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, లక్ష మంది ఒంటరి మహిళ లు, బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. వృద్ధులకు రూ.3వేలు, దివ్యాంగులకు రూ.4వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని ఉద్ఘాటించారు. సమైక్య పాలనలో ఉన్న విద్యుత్ సమస్యలన్నీ అధిగమించి రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని పునరుద్ఘాటించారు.
సాగుకు మూడు గంటల కరెంటు సరిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడడం తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచేందుకేనని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ అడుగకముందే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, కల్లబొళ్లి మాటలు మాట్లాడే కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. మూడోసారి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తేవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నేరెళ్ల గంగారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు జలందర్, ఫాక్స్ అధ్యక్షులు రాజసుమన్ రావు మాధవరావు, మారెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్లు, వైస్ ఎంపీపీ సత్తయ్య వైస్ చైర్మన్ లింగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, యువత అధ్యక్షులు రవీందర్, మారెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గంగాధర్, గొల్లపల్లి పట్టణ అధ్యక్షుడు జలంధర్, నాయకులు శ్రీనివాస్, లింగారెడ్డి, నారాయణరెడ్డి ఉన్నారు.