‘మంచి మనసున్న మధన్నను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించండి. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ. వెయ్యికోట్లతో అభివృద్ధికి బాటలు వేసుకోండి’ అంటూ మంథని నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్‌కు మద్దతుగా ఆదివారం ఆమె రామగిరి, కాటారంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై ప్రసంగించారు. ఉద్యమ సమయంలో ఈ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇక్కడికి రావడం ఆనందంగా ఉన్నదన్నారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఐదేండ్లలో ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. కనీసం ఆపదలో ఉన్నవారికి పైసా సాయం చేయలేదని, అలాంటి వ్యక్తికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. బుల్లెట్ లాంటి వ్యక్తి మధన్నను దీవించి అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు.
నేను ఇక్కడే పుట్టిన. ఇక్కడే పెరిగిన. గెలిచినా.. ఓడినా ప్రజల మధ్యనే ఉన్న. ప్రజల సమస్యలు పరిష్కరించిన. పెద్దమొత్తంలో నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టిన. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపిన. కానీ కొందరు నాపై దుర్మార్గపు ప్రచారానికి ఒడిగట్టి ప్రజలకు దూరం చేసిన్రు. అందుకు ఎంతగానో బాధపడ్డ. ఇప్పుడు మీ ముందుకు వచ్చిన. మీ బిడ్డగా అడుగుతున్న. మరోసారి దీవించిండి. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుత.
– ప్రజా ఆశీర్వాద సభలో మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
పెద్దపల్లి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘మంథని మట్టి బిడ్డ పుట్ట మధన్న నేను వదిలిన బుల్లెట్. మాట తూటాలాగా ఉంటది. కానీ చాలా మంచి వ్యక్తి. మూడోసారి మీ ఆశీర్వాదం కోసం మీ ముందు నిలబడ్డడు. మీరు అవకాశమిస్తే మరోసారి మంథని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపుతడు. గెలిచినా.. ఓడినా మీ మధ్యనే ఉన్నడు. సేవ చేసిండు. 70వేల ఓట్ల భారీ మెజార్టీతో పుట్ట మధన్నను గెలిపించండి. గులాబీ కండువా ఇక్కడ ఉంటే నిధులు వరుదలా వస్తయి.
జరిగిన అభివృద్ధిని చూడండి. బీఆర్ఎస్ను గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి’ అని ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలం సెంటినరీకాలనీ వాణి విద్యానికేతన్ క్రీడా మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పుట్ట మధన్నను గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఆ విధంగా మంథని నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందన్నారు.
సీఎం కేసీఆర్ అనేక సభల్లో పాల్గొన్నారని, కానీ మంథని సభలో రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ అలా ప్రకటించారంటే మంథని నియోజకవర్గాన్ని ఆయన దత్తత తీసుకున్నట్లేనని ఆమె వివరించారు. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం కావాలంటే సీఎం కేసీఆర్‌కు దగ్గరైన పుట్ట మధూకర్ ఎమ్మెల్యే కావడంతోనే సాధ్యమవుతుందన్నారు. మీ అందరికీ వినమ్రంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా మధన్నను గెలిపించాలని ఆమె కోరారు. సీఎం కేసీఆర్ 15 ఏండ్లు ఉద్యమం బావుట ఎగురవేస్తే సింగరేణి కార్మిక క్షేత్రం ఆయనకు వెన్ను దన్నుగా నిలిచిందన్నారు. సింగరేణి సమ్మె చేయగానే సౌత్ ఇండియాలో పవర్ కట్ అయి ఢిల్లీలో పవర్ ఫీవర్‌తో తెలంగాణ ప్రకటన వచ్చిందని గుర్తుచేశారు. ఇది సింగరేణి కార్మికుల ఘనతను చెప్పుకోచ్చారు. పదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచారని, ప్రజల అక్కర్లను తీర్చారన్నారు. 22 అంశాల్లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. కేసీఆర్ గెలిచిన వెంటనే రేషన్ కార్డులను ఇచ్చుకొని రైతు బీమా మాదిరిగా అందరికీ జనరల్ బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెడుతారని చెప్పారు.
నాడు సింగరేణిని అప్పుల పాల్జేసి దివాలా తీయించింది కాంగ్రెస్ పార్టే. సింగరేణి బొగ్గు బ్లాక్‌లు పోయే దుస్థితిలో ఉండగా నిలుపుకోవడానికి అప్పులు చేసిన మాట వాస్తవం కాదా..? అందు కోసం కేంద్రానికి 49 శాతం వాటా ఇచ్చి సింగరేణిని తాకట్టు పెట్టింది నిజమే కదా. కాంగ్రెస్ అధికారంలో ఉంటే సింగరేణి ఎప్పుడో మూత పడేది. ఈ విషయాన్ని ప్రతి సింగరేణి కార్మికుడూ గుర్తించాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీబీజీకేఎస్ ప్రాతినిధ్యంతో సింగరేణిలో అనేక బొగ్గు బ్లాక్‌లు మూత పడకుండా కృషి చేసినం. కార్మికులకు 32 శాతం లాభాల వాట వచ్చేలా చేసినం. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించుకొని 12వేల మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇప్పించుకున్నం.
పెండింగ్‌లో ఉన్న 3500 మందికి ఉద్యోగాలు కల్పించుకున్నం. బీఆర్ఎస్ పాలనలో 19వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నం. ఈ ఉద్యోగాల కోసం మనం ప్రయత్నం చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం కేసులు పెట్టుకుంటూ వెళ్లిన్రు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ సింగరేణి బతికించుకున్నం. ఆర్టీసీ, ప్రభుత్వ రంగ సంస్థలను, పబ్లిక్ సెక్టార్ల, ప్రైవేట్ సెక్టార్లను కాపాడుకోవడానికి కేసీఆర్ కృషి చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ వాటిని అమ్మకానికి పెడుతున్నది. సింగరేణి సిరుల వేణి. తెలంగాణ మన ప్రాణం.. ఆ ప్రేమ కాంగ్రెస్‌కు అర్థం కాదు. రేవంత్‌రెడ్డి నుంచి మొదలుకొని శ్రీధర్‌బాబు వరకు అవినీతి గురించి మాట్లాడుతున్నరు. అసలు అవినీతి పరులు వాళ్లే.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టును 80వేల కోట్లతో నిర్మిస్తే.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి మొదలుకొని, శ్రీధర్‌బాబు వరకు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నరు. వారి ఆరోపణలకు ఏమైనా లెక్కా, పత్రం ఉన్నదా..? మేం కూడా అలా చౌక బారు విమర్శలు చేయచ్చు. కానీ అది మా నైజం కాదు. సీఎ కేసీఆర్ తన శక్తి, మేధస్సు, రక్తాన్ని కరిగించి అనేక కార్యక్రమాలను రాష్ట్రం కోసం చేసిండు. కాంగ్రెస్ హయాంలో రైతులను పిలిచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 73లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నడు. మరో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి 50లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఆలోచనలో ఉన్నడు.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
శ్రీధర్‌బాబు మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడి ప్రజలకు చేసిందేమీలేదు. తొమ్మిదిన్నరేళ్లలో మా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో మేం చూపిస్తం. నీకు ధైర్యం ఉంటే ఇన్నేండ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించు. ఎక్కడికి రమ్మంటావో అక్కడికి మా అభ్యర్థి పుట్ట మధూకర్ వస్తడు. నీకు చిత్తశుద్ధి ఉంటే వచ్చి నిరూపించుకోవాలి. కాబోయే ఎమ్మెల్యే పుట్ట మధన్నే. మంథని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారే వస్తుంది. ఇదే విషయాన్ని అన్ని సర్వేలు చెబుతున్నయి. మంథని నియోజకవర్గంలో మళ్లీ పొరపాటును, గ్రహపాటును కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే శ్రీధర్‌బాబు నా సర్కారు లేదనే అంటడు. ఆయన ఇక్కడకు రాడు. ఆయనకు ఓటు వేయడం వల్ల ఇప్పటికే మంథని నియోజకవర్గం అభివృద్ధిలో ఐదేళ్లు వెనక్కి పోయింది. ప్రజలారా వివేకంతో ఆలోచించాలి. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత