అపర భగీరథుడు నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలి
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ);తెలంగాణ సాధకుడు.. ప్రగతి సారథి.. సీఎం కేసీఆర్ ముందస్తు జన్మదిన సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం ముఖ్యమంత్రి బర్త్‌డే సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో రంగంలోకి దిగిన పార్టీ శ్రేణులు, మంగళవారం పల్లె, పట్టణం అనే తేడాలేకుండా సేవా కార్యక్రమాలు చేశాయి. అన్నదానాలు, దవాఖానలు, వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తులు పంపిణీ చేపట్టాయి. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా, ఆయాచోట్ల ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు ప్రజలకు అన్నం వడ్డించారు. అపరభగీరథుడు పదికాలాల పాటు చల్లగా ఉండాలని కాంక్షించారు.
సీఎం కేసీఆర్ బర్త్‌డే తెలంగాణ ప్రజలకు మతాలకు అతీతంగా ఒక పెద్ద పండుగ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌక్‌లో నగర మేయర్ వై సునీల్‌రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 70 ఏళ్ల పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. సీఎం కేసీఆర్ మరణం చివరి అంచు వరకు వెళ్లి తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం ఈ రాష్ట్ర ప్రజలకు వరం అన్నారు.
అందుకే ఈ సారి ఆయన జన్మదినోత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నేతగా దేశంలో అత్యుత్తమంగా అభివృద్ది చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మహానేత నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన జన్మదినోత్సవం 17న పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించుకుంటామన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, నగర కార్పొరేటర్లు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.