కరీంనగర్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ పెద్దపల్లి (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. భారీ బహిరంగ సభా వేదికగా రాష్ట్రం, దేశంలో బీజేపీ చేస్తున్న ఆగడాలను, కక్షపూరిత చర్యలపై ప్రజలను జాగృతం చేస్తూనే జిల్లాకు నిధులు మంజూరు చేశారు. నిరంతరం భూతల్లి గర్భంలో పనిచేసే సింగరేణి కార్మికులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల వాటాలను పంచడంతో పాటు దసరా బోనస్‌ను పెంచింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల పిల్లలు ఉద్యోగాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశాయని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలను ఇచ్చి వారిని ఆదుకున్నదన్నారు.
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగమైన పెద్దపల్లి, రామగుండం, మంథని టీఆర్ఎస్కు గుండెకాయలా నిలిచాయని, అలాంటి నియోజకవర్గాలకు పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాగా పెద్దపల్లిని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. “ఎవరైనా పెద్దపల్లి జిల్లా అవుతుందని ఎప్పుడైనా.. ఊహించారా..?” అని అన్నారు. అలాంటి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్లో డివిజన్ల పెంపుతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ను మున్సిపాలిటీలుగా అభివృద్ధి చేశామన్నారు. రామగుండం కార్పొరేషన్ సహా, మూడు మున్సిపాలిటీల్లో మరింత అభివృద్ధికి రూ.4 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా మంథని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ విజ్ఞప్తి మేరకు జిల్లాలోని 267 గ్రామ పంచాయతీలకు ఒక్కోదానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంథని నియోజకవర్గంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును అతి త్వరలో పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మంథనిలోని పోతారం లిఫ్ట్‌కు మంజూరు ఇవ్వాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు హర్షధ్వానాలు చేశారు.