పదో తరగతి మూల్యాంకనం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు అంతర్మథనంలో పడ్డాయి. స్పాట్ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వచ్చిన అర్జీల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆ యూనియన్లు ముందు తప్పటడుగులు వేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో చర్యలకు అడ్డుకట్ట వేయాలని టీచర్ల నుంచి ఒత్తిడి పెరుగుతుండగా.. తప్పని తెలిసినా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితులను చూస్తే ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’ అన్న చందంగా ఉండగా.. దీని నుంచి గట్టెక్కేందుకు పలు సంఘాలు సోమవారం కరీంనగర్ డీఈవోకు వినతిపత్రం అందించాయి. అయితే, సదరు విజ్ఞప్తిలో ఏ ఒక్క డిమాండ్ పరిపూర్ణంగా లేదనే తెలుస్తుండగా.. తప్పు చేసిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయా..? అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.
కరీంనగర్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ (మూల్యాంకనం) ఈ నెల 3 నుంచి ప్రారంభమైంది. దీనిని పూర్తి చేసేందుకు 1087 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ విధులను కేటాయించింది. అయితే, ఈ డ్యూటీ నుంచి తమకు మినహాయింపునివ్వాలని కోరుతూ 600కు పైగా మంది అర్జీలు పెట్టుకున్నారు. అందులో మెజార్టీ టీచర్లు అనారోగ్య కారణాలు చూపడంతో అనుమానించిన అధికారులు, కలెక్టర్ ఆదేశాల మేరకు క్యాంపు స్థానంలోనే మెడికల్ బోర్డు వైద్యుల ద్వారా పరీక్షలు చేయించారు. 80 శాతం అర్జీలు బోగస్‌గా నిర్ధారించారు.
నిజమైన అర్హులకు మినహాయింపునిచ్చారు. అయితే, బోగస్‌గా తేల్చినప్పటికీ కొంత మంది విద్యాశాఖ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ వ్యవహరించిన తీరుపై ఇప్పటికే 62 మందికిపైగా ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో.. మరికొంత మంది పంతుళ్లు బయట తిరుగుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో సదరు ఉపాధ్యాయులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారయంత్రాగం సిద్ధమవుతున్న తీరుపై.. ‘ఉపాధ్యాయులపై ఉక్కుపాదం?’ శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది. ఈ కథనం అన్ని ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడమే కాకుండా.. హాట్ టాపిక్‌గా మారి, తీవ్ర చర్చ జరిగింది.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన టీచర్లపై అధికారులు చర్యలకు సిద్ధమైన నేపథ్యంలో సదరు ఉపాధ్యాయులు.. సంఘాలపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తున్నది. ఎలాగైనా సరే చట్టపరమైన చర్యలకు అడ్డుకట్ట వేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘా ల ఐక్య కార్యాచరణ సమితి పేరుతో సంఘాలు సోమవారం క్యాంపు కార్యాలయం వద్ద డీఈవోను కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేశాయి. అయితే సదరు వినతిపత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే.. సంఘాలు అంతర్మథనంలో పడ్డాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పలు సంఘాలు ముందుగానే తప్పటడుగులు వేశాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిబంధనల ప్ర కారం అర్హులకు మినహాయింపు కోరితే బాగుడేంది. కానీ, చాలా సంఘాలు తమ తమ ఉపాధ్యాయులను కాపాడుకునేందుకు.. అర్జీ పెట్టుకున్న వారికి మినహాయింపునిచ్చి.. ఆ తర్వాత సీనియార్టీ ఉన్న టీచర్లకు విధులు అప్పగించాలని గతంలోనే డీఈవో దృష్టికి తెచ్చిన వ్యవహారం ప్రస్తుతం ఆ సంఘాల మెడకు చుట్టుకున్నది. అర్జీల్లో చాలా మేరకు బోగస్ అని తేలడంతో.. సంఘాల పరిస్థితి ప్రస్తుతం ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నచందంగా మారింది. సంఘాలు గట్టిగా విద్యాశాఖను ప్రశ్నిస్తే.. వచ్చిన అర్జీలు, అందులో తేలిన బోగస్ వ్యవహారాలను వారి ముందు పెట్టేందుకు అధికారులు అన్నింటినీ సిద్ధం చేశారు. అంతేకాదు, సంఘాల కోరిక మేరకు అర్హులను విధుల నుంచి తొలగించారు.
ఇదే సమయంలో మినహాయింపునివ్వని ఉపాధ్యాయులు మూ ల్యాంకనానికి ఎందుకు హాజరు కావడం లేదో చెప్పాల్సిన బాధ్యత సైతం సంఘాలపై పడింది. అలాగే, ఒకటికి రెండు సార్లు అధికారులు హెచ్చరించినా.. కొంత మంది టీచర్లు సదరు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ బయట తిరుగుతున్న విషయంలోనూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితి నెలకొన్నది.
ఉపాధ్యాయుల్లో తమ పట్టు నిలుపుకునేందుకే సంఘాలు సోమవారం జిల్లా విద్యాధికారికి వినతిపత్రం అందించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వినతిని నిశితంగా పరిశీలిస్తే.. ఏ ఒక్క డిమాండ్ పరిపూర్ణంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు.. స్పాట్ కేంద్రంలో భౌతిక వసతులు కల్పించాలని, అలాగే కూలర్ వంటివి ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నది. అయితే మరో మూడు రోజుల్లో స్పాట్ ముగుస్తున్న సమయంలో ఈ డిమాండ్ సహేతుకంగా కనిపించడం లేదు. ఈ విషయాన్ని ముందుగానే అధికారుల దృష్టికి తెచ్చామని, ఆ మేరకు భౌతిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని సంఘాలు ఆరోపిస్తున్నాయి.
నిజానికి భౌతిక వసతులు కల్పించాలన్న డిమాండ్ సహేతకమైంది. మూల్యాంకనం చేసే టీచర్లకు తగిన వసతులు సమకూర్చకపోతే.. సమకూరే వరకు ఉపాధ్యాయ సంఘాలు వాయిస్ వినిపించాలి. కానీ, సంఘాలు ఆ దిశగా డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. అదే జరిగి ఉంటే.. స్పాట్ ప్రారంభమైన ఆరు రోజుల తర్వాత ఆ ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. సోమవారం ఇచ్చిన విన్నపంలో భౌతిక వసతులు సమకూర్చడంలో జిల్లా విద్యాశాఖ విఫలమైందని సంఘాలు పేర్కొన్నాయి. అయితే ఆరు రోజులుగా ఎందుకు అడుగలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అనారోగ్యం, ఉద్యోగ విరమణ, ఇలా వివిధ కారణాలతో స్పాట్ నుంచి మినహాయింపు కోరిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, వీటిని భర్తీ చేసేందుకు దిగువన ఉన్న సీనియార్టీ వారిని తీసుకోవాలని కోరామని, ఈ విషయాన్ని సైతం అమలు చేయలేదని సంఘాలు ఆ వినపతిపత్రంలో సంఘాలు పేర్కొన్నాయి. అయితే, అనారోగ్య కారణాలు సహేతుకంగా ఉన్నవారికి విద్యా శాఖ మినహాయింపునిచ్చింది. ఆ స్థానంలో ఇతర టీచర్లను నియమించి స్పాట్ నిర్వహిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై దృష్టి పెట్టింది. అయితే ఆదేశాలను బేఖాతర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలా..? లేదా..? అన్నదానిపై మాత్రం సంఘాలు ఎక్కడా స్పష్టత ఇవ్వలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంటే తప్పు చేసిన వారిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నాయా..? అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే, స్పాట్ నుంచి మినహాయింపు పొందిన టీచర్లను తిరిగి వారి వారి పాఠశాలల్లో చేర్చుకునేందుకు సంబంధింత హెచ్ఎంలకు సమాచారం ఇస్తామని చెప్పారని, ఆ హామీని కూడా అమలు చేయలేదని వినతి పత్రంలో పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారం మినహాయింపు ఇచ్చే అధికారం క్యాంపు అధికారి(డీఈవో)కి మాత్రమే ఉంటుంది. అర్జీలో పెట్టుకున్న కారణాలు సహేతకం అయినవే అయితే.. మినహాయింపు ఇస్తారు. ఆ వివరాలు రిలీవ్ ఆర్డర్‌లోనే ఉంటాయి. క్యాంపు అధికారి మినహాయింపు ఇచ్చిన వారిని తిరిగి వారి వారి పాఠశాలల్లో చేర్చుకోవాలని విద్యాశాఖ గతంలోనే స్పష్టంగా చెప్పింది.
కానీ, విద్యాశాఖ నుంచి రిలీవ్ ఆర్డర్ ఇవ్వని ఉపాధ్యాయులను మాత్రమే పాఠశాలల్లో చేర్చుకోవద్దని, ఒక వేళ చేర్చుకుంటే సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అందులో విద్యాశాఖాధికారుల నిర్ణయం స్పష్టంగా ఉంది. గతంలో చెల్లించాల్సిన స్పాట్ రెమ్యూనరేషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఇవ్వలేదన్నది మరో డిమాండ్. ఉపాధ్యాయులకు రావాల్సిన ప్రతి పైసా ఇవ్వాలని డిమాండ్ చేసే అధికారం హక్కు సంఘాలకు ఉంటుంది. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉన్నది.