సుల్తానాబాద్ రూరల్, జూలై 11 : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో భారీగా ధాన్యం మాయమైంది. టాస్క్ఫోర్స్, సివిల్ సైప్లె అధికారులు గురువారం రాత్రి నుంచి చేస్తున్న దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేటాయించిన ధాన్యాన్ని అక్రమంగా దారిమళ్లించినట్టు తెలుస్తున్నది.
రైతులు పండించిన ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యంను మిల్లు యజమానులు పక్కదారి పట్టిస్తున్నారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాట్నపల్లి పరిధిలోని రెండు రైస్ మిల్లుల్లో శుక్రవారం కూడా టాస్క్ పోర్స్, సివిల్ సైప్లె అధికారులు తనిఖీ చేయగా, రెండు మిల్లులకు సంబంధించి 19,441 క్వింటాళ్ల ధాన్యం తగ్గినట్టు గుర్తించారు. దీని విలువ రూ.5కోట్ల లక్షా 60వేల వరకు ఉంటుందని టాస్క్ఫోర్స్ వోఎస్డీ ప్రభాకర్ తెలిపారు.
గురువారం రాత్రి అనుమానంతో నాలుగు లారీలను టాస్క్ఫోర్స్, సివిల్ సైప్లె అధికారులు పట్టుకున్నారు. కాగా, తగ్గిన ధాన్యం అక్రమంగా తరలించారా..? అనే దానిపై ఆరా తీస్తున్నారు. సివిల్ సైప్లె చట్టం ప్రకారం ధాన్యం లేకపోవడంతో నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. క్రిమినల్ కేసులను కూడా నమోదు చేస్తామని చెప్పారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్, పెద్దపల్లి డీఎస్వో శ్రీనాథ్, సివిల్ సైప్లె అధికారులు మహేశ్ కుమార్, సంతోష్ సింగ్, రాజిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్స్ రమేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.