Sircilla | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 31 : ఆగస్టు 23న సిరిసిల్లలో నిర్వహించనున్న CITU అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభను విజయవంతం చేయాలని సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. సిరిసిల్లలోని CITU జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి CITU జాతీయ, రాష్ట్ర నాయకులు, టెక్స్టైల్–పవర్లూమ్ రంగాల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశాల్లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, పవర్లూమ్ కార్మికుల సంక్షేమం, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న ఈ జాతీయ స్థాయి సమావేశాలు, బహిరంగ సభను జిల్లాలోని పవర్లూమ్ కార్మికులు, యజమానులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో CITU నాయకులు ముషం రమేష్, కూరపాటి రమేష్, కోడం రమణ, సిరిమల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.