చొప్పదండి, ఫిబ్రవరి 8 : ఏడేళ్ల కాలంలో ఎంపీ బండి సంజయ్ చొప్పదండి నియోజకవర్గానికి ఏడు కొత్తలు కూడా తేలేదని, కాంగ్రెస్ రెండున్నరేళ్లలో రెండు పైసల పని కూడా చేయలేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆదివా రం చొప్పదండిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేజ ర్ పంచాయతీగా ఉన్న చొప్పదండిని మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ చేసి అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టేనని స్పష్టం చేశారు. అంతే కాకుండా, కోట్లాది నిధులు వెచ్చించి పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దకుతుందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం చేపట్టిన సెంట్రల్ లైటింగ్, ఇంటిగ్రేటెడ్ మారెట్ నిర్మా ణ పనులను అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పూర్తి చేయడం చేతకాని కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇటీవల జరిగిన సీఎం సభ అట్టర్‌ఫ్లాప్ కావడంతో ఆ పార్టీ నాయకుల కు దికుతోచడం లేదని ఎద్దేవా చేశారు. చొప్పదండి పట్టణ అభివృద్ధికి 50 కోట్ల నిధులు మంజూరు చేశానని సీఎం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పట్టణంలో నిర్మాణమై ఉన్న వంద పడకల దవాఖాన, ఇంటిగ్రేటెడ్ మారెట్ను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సత్యం చొప్పదండిలో ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా ప్రజలు హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారని, ఎదురు తిరుగుతున్నారని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని గ్రామాల్లో సమస్యల గురించి ఎంపీ బండి సంజయ్‌కు తెలుసా? అని, ఎప్పుడైనా పర్యటించారా? అని ప్రశ్నించారు. చొప్పదండిని అభివృద్ధి చేసింది, మునిసిపల్‌పై గులాబీ జెండా ఎగురవేసేది తామేనని స్పష్టం చేశారు.