వారంతా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు.. కానీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కరాటే వేదికలపై చిచ్చర పిడుగులుగా మారి సత్తా చాటుతున్నారు. కరీంనగర్‌లోనే కాకుండా ఇతర రాష్ర్టాలు, దేశాల్లో జరిగే పోటీల్లో సైతం ప్రతిభను చాటుతున్నారు. ప్రతి టోర్నమెంట్లో పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. పట్టుదల, కఠోర శ్రమతో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ఇప్పటికే మలేషియా, థాయిలాండ్, నేపాల్ దేశాలతో పాటు భారత్‌లోని ఢిల్లీ, గోవా, హర్యానా, మధ్యప్రదేశ్, హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలతో పాటు చాంపియన్‌షిప్, గ్రాండ్ చాంపియన్‌షిప్‌లనూ కైవసం చేసుకున్నారు. సీనియర్ కరాటే కోచ్ ఆర్ ప్రసన్నకృష్ణ ఆధ్వర్యంలో నగరంలోని భగత్‌నగర్‌లోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో శిక్షణ పొందుతూ కరాటే పోటీల్లో రాణిస్తున్న నగరానికి చెందిన క్రీడాకారులపై కథనం..
నగరంలోని వాణీనికేతన్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న శ్రీతిక్నందన్ ఇటీవల నిర్వహించిన నేపాల్ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో కటా విభాగంలో సిల్వర్ మెడల్, కుమిటీ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించి సత్తాచాటాడు. అలాగే ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ చాంపియన్‌షిప్, వైజాగ్‌లో జరిగిన సౌత్ ఇండియా చాంపియన్‌షిప్‌లో కటా విభాగంలో గోల్డ్ మెడల్, గోవాలో నిర్వహించిన ఆల్ ఇండియా చాంపియన్‌షిప్‌లో కటా విభాగంలో గోల్డ్, కుమిటీ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. ఒలింపిక్స్‌లో జరిగే కరాటే పోటీల్లో పాల్గొని పతకం సాధించడమే తన ధ్యేయమంటున్నాడు.
నగరంలోని విద్యాధరి హైస్కూల్లో 5వ తరగతి చదువుతున్న మణితేజ కరాటేలో విశేషంగా రాణిస్తున్నాడు. పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకం సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ చాంపియన్‌షిప్‌లో కటా విభాగంలో సిల్వర్ మెడల్, వైజాగ్‌లో నిర్వహించిన సౌత్ ఇండియా చాంపియన్‌షిప్‌లో కటా విభాగంలో గోల్డ్, కుమిటీ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించాడు. అలాగే కరీంనగర్లో జరిగిన ఇండో నేపాల్ చాంపియన్‌షిప్, ఆల్ ఇండియా చాంపియన్‌షిప్ పోటీల్లో కటా విభాగంలో గోల్డ్, కుమిటీ విభాగంలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించి ప్రతిభను చాటాడు. కరాటేపై ఇష్టంతో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నానని, దీంతో ఏదైనా సాధించే ఆత్మైస్థెర్యం వచ్చిందంటున్నాడు.
కరీంనగర్‌లోని అచీవర్స్ అక్టీవ్ హైస్కూల్లో 5వ తరగతి చదువుతున్న వీ అక్షర ఆత్మైస్థెర్యం కోసం కరాటేలో శిక్షణ పొందుతుండగా, పోటీల్లో సైతం విశేషంగా రాణిస్తూ అబ్బుర పరుస్తున్నది. కరీంనగర్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్‌లో కటా విభాగంలో గోల్డ్, కుమిటీ విభాగంగా బ్రాంజ్ మెడల్స్ సాధించింది. అలాగే హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ చాంపియన్‌షిప్ పోటీల్లో కటా విభాగంలో గోల్డ్ మెడల్, కరీంనగర్ నిర్వహించిన ఇండో నేపాల్ చాంపియన్‌షిప్‌లో కటా విభాగంలో గోల్డ్, కుమిటీ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. కరాటే శిక్షణతో ఆత్మైస్థెర్యంతో ఐపీఎస్ అయి శాంతి భద్రతల పరిరక్షణకు కృషిచేస్తానంటున్నది.
గతంలో క్రీడలన్నా, కరాటే శిక్షణన్నా పేరెంట్స్ ఎక్కువగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ, ఇప్పుడు వారిలో గణనీయమైన మార్పు వచ్చింది. చదువుతో పాటు పిల్లలకు ఇష్టమైన క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రోత్సాహంతోనే పిల్లలు కరాటేలో విశేషంగా రాణిస్తున్నారు. కరాటేతో పిల్లల్లో ధైర్యం రెట్టింపు కావడంతో పాటు దృఢత్వంగా మారుతారు. వారిలో ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మా వద్ద శిక్షణ పొందుతున్న చిన్నారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికల్లో పతకాలు సాధిస్తూ ప్రతిభను చాటుతున్నారు. ఒత్తిళ్లతో కూడిన చదువు, పోటీతత్వం పెరిగిన నేపథ్యంలో క్రీడలు, కరాటే శిక్షణ వారిలో ఉత్సాహాన్ని నింపుతాయి.