Rajanna Siricilla | చందుర్తి, జూన్ 28 : ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన శనివారం చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం కోనరావుపేట మండలం బావు సాయిపేట గ్రామానికి చెందిన కదురిక సరిత, రమేశ్‌ల కూతురు మహల(8) ఇటీవల అమ్మమ్మ ఊరైన చందుర్తి మండలం కిష్టంపేట వచ్చింది. ఈ నెల 19న తేలు కుట్టిందని జోగాపూర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు సంజీవ్‌ను సంప్రదించారు. ఆర్ఎంపి వైద్యుడు రెండు ఇంజక్షన్లు ఇచ్చి నయమవుతుందని ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో వేములవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈనెల 25న బాలిక తల్లి సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్ఎంపి వైద్యుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జిల్లెల రమేష్ వెల్లడించారు.