కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 9: మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. అత్తింటికి వచ్చి ప్రమాదవశాత్తూ బావిలో పడగా, ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిశాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని గుండెలు బాదుకున్నారు. ‘ఆ దేవుడు ఎంత పనిచేసే బిడ్డా..’ అంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లికి చెందిన గడ్డం అజేందర్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు. మూడు రోజుల క్రితం కరీంనగర్ మండలం బహ్దుర్ఖాన్పేటకు చెందిన ఆయన అక్కా బావ మంజుల, రాజిరెడ్డి బొమ్మారెడ్డిపల్లికి వచ్చారు. వెళ్లే ముందు అజేందర్‌రెడ్డి పెద్ద కూతురు జశ్విత (3)ను తమ వెంట తీసుకెళ్లారు. బుధవారం ఉదయం బహ్దుర్ఖాన్పేటలోని వారి వ్యవసాయ పొలం వద్దకు మంజుల, రాజిరెడ్డితోపాటు కొడుకు అభిరామ్‌రెడ్డి వెళ్లారు.
వెంట జశ్వితను కూడా తీసుకెళ్లారు. పొలం వద్ద ఉన్న చెట్టు కిందే చిన్నారి చాలాసేపు ఆడుకున్నది. అయితే చెట్టు కొట్టేసేందుకు కూలీలు రాగా, అడ్డుగా ఉన్న ట్రాక్టర్‌ను అభిరామ్‌రెడ్డి పక్కకు తీసే క్రమంలో చిన్నారిని వాహనం ముందు భాగంలో ఎక్కించుకున్నాడు. కాస్త ముందుకు వెళ్లి బావి ముందు రెండో గేర్‌లోనే ట్రాక్టర్‌ను ఆఫ్ చేసి, తాళం అలాగే ఉంచి కిందికి దిగి పని నిమిత్తం పక్కకు వెళ్లిపోయాడు. అయితే జశ్విత కీని ఆన్ చేయడంతో ట్రాక్టర్ ముందుకు వెళ్లి బావిలో ఆమెతో సహా పడిపోయింది. సమాచారం మేరకు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. అభిరామ్ నిర్లక్ష్యంతోనే తన కూతురు మృతిచెందిందని తండ్రి అజేందర్ రెడ్డి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.