చొప్పదండి, అక్టోబర్ 7: బుడిబుడి అడుగులు వేస్తూ స్కూల్కు వెళ్లాల్సిన ఓ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో మృత్యుఒడికి చేరింది. వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి మండలం కొలిమికుంటకు గ్రామానికి చెందిన పంజాల కొమురెల్లి పల్లవి దంపతులది పేద కుటుంబం. కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు అన్విక(5) గ్రామంలోని పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నది. మూడు నెలల క్రితం పాఠశాలకు వెళ్లిన చిన్నారి, తరగతి గదిలో పడిపోవడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లి పరీక్షలు చేయించగా, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. కూలీ పనిచేసే కొమురెల్లి తన బిడ్డను బతికించుకునేందుకు అప్పులు తెచ్చి చికిత్స చేయించాడు. గత నెల 24న అన్విక ఐదో పుట్టినరోజు వేడుకలు జరిపించాడు. అయితే ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన అన్వికను సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ దవాఖానకు తరలిస్తుండగా, గమ్యం చేరకముందే తుదిశ్వాస విడిచింది. బిడ్డను కాపాడుకునేందుకు దవాఖానల చుట్టూ తిరుగుతూ 10 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఆ తల్లిదండ్రులకు శోఖమే మిగిలింది.