Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 7 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని చిగురుమామిడి మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చిగురుమామిడి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ కోడం కనకయ్య, ఎంపీడీవో రామ్మోహన్ చారికి సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక వాటి అమలును విస్మరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, పేద ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంకా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, ఎన్నికల సమయంలో చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ప్రజావాణికి పిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల నాయకులు రామోజు కృష్ణమాచారి, కత్తుల రమేష్, ఎండీ సర్వర్ పాషా, బుర్ర తిరుపతి, బెజ్జంకి లక్ష్మణ్, బోయిని శ్రీనివాస్, మిట్టపల్లి మల్లేశం, బెజ్జంకి రాంబాబు, శరభంద రెడ్డి, మక్బూల్ పాషా, కాశ బోయిన రాజు, దశరథం తదితరులు పాల్గొన్నారు.