భోపాల్: స్కూల్ ప్రిన్సిపాల్ ఒక విద్యార్థిని కొట్టడంపై 360 మంది విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. స్కూల్ హాస్టల్లో తమను తాము బంధించుకున్నారు. పలు గంటల పాటు హాస్టల్ గదుల్లో ఉండి లోపల నుంచి గడియపెట్టుకున్నారు. ఆ ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. చివరకు అధికారులు అక్కడకు చేరుకుని హామీ ఇవ్వడంతో బయటకు వచ్చారు. (students lock Up in hostel) మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జరంగ్గఢ్లోని జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఆహారం నాణ్యతపై ఫిర్యాదు చేయగా ప్రిన్సిపాల్ హెచ్‌కే మీనా దారుణంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
కాగా, ఆ స్కూల్ విద్యార్థులు దీనిపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదివారం సాయంత్రం 9 నుంచి 12వ తరగతికి చెందిన సుమారు 360 మంది విద్యార్థులు తమ హాస్టల్ గదుల్లో బంధీ అయ్యారు. రూమ్స్ లోపల నుంచి గడియపెట్టుకున్నారు. పలు గంటల పాటు హాస్టల్స్ రూమ్స్‌లో ఉండిపోయారు. ఆ ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తాము ఆహారం తీసుకోబోమని, నిరాహార దీక్ష చేస్తామని వారు హెచ్చరించారు. ఉపాధ్యాయులు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ గేట్లు తెరవడానికి విద్యార్థులు నిరాకరించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
గంటల తరబడి నచ్చజెప్పడంతోపాటు హామీలు ఇచ్చారు. దీంతో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో విద్యార్థులు హాస్టల్ గేట్లు తెరిచి బయటకు వచ్చారు. భోజనం చేయడానికి అంగీకరించారు.
అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఒక సంయుక్త దర్యాప్తు బృందాన్ని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. నవోదయ సంస్థకు చెందిన ప్రాంతీయ అధికారులు అక్కడకు చేరుకుని ఆహార నమూనాలు సేకరించారు. బాధిత విద్యార్థితో పాటు ఇతర స్టూడెంట్స్ వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ సంఘటనపై నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.