ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్, ఇప్పుడా విషయాన్నే మరిచిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ గద్దెనెక్కి ఏడాది కావస్తుండగా, మేనిఫెస్టో అమలును అటకెక్కించింది. అందులో ఒకటి రెండు అమలు చేసినట్టు ఆర్భాటపు, అబద్ధపు ప్రచారాలు చేయడమే తప్ప, ఏ ఒక్క స్కీంను సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్మి ఓట్లు వేసిన ఉమ్మడి జిల్లా ప్రజలు.. ఆ నాడు ఇచ్చిన హామీలపై నేడు వేములవాడకు వచ్చే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు, పంచాయతీల్లో నిధులేమి, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్లు, రైతుల రుణమాఫీ వంటి అనేక అంశాలపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ పథకం కింద డబుల్బెడ్రూం ఇంటిని 5లక్షలతో నిర్మించి ఇస్తామని ప్రకటించింది. ఆ మేరకు ఒక్కో శాసనసభా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని చెప్పింది. ఆ లెక్కన ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 45,500 ఇండ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక కోసం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తుండగా, ప్రస్తుతం ఆ కమిటీ జాబితాలు ఇన్చార్జి మంత్రుల వద్ద పెడింగ్‌లో ఉన్నాయి. అవి ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో ఇప్పటి వరకు తెలియదు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎప్పుడు మొదలు పెడుతారో స్పష్టత లేదు. కానీ, ప్రభుత్వ మాటల నమ్మి లక్షలాది మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఉమ్మడి జిలాల్లో ఇండ్ల కోసం 7,18,099 దరఖాస్తులు అధికారుల వద్ద ఉన్నాయి. అందులో కరీంనగర్లో 2,17,220, జగిత్యాలలో 2,05,412, పెద్దపల్లిలో 1,85,154, రాజన్న సిరిసిల్లలో 1,10,313 అర్జీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఈ విషయంపై ఏమైనా స్పష్టత ఇస్తారా..? లేదా..? చూడాలన్న ఆశ దరఖాస్తుదారుల్లో నెలకొన్నది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,218 పంచాయతీలు నిధులలేమితో తల్లడిల్లుతున్నాయి. అందులో చాలా వరకు రోజువారీ నిర్వహణ కూడా చేయలేని దుస్థితిలో ఉన్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి కింద తీసుకున్న కార్యక్రమాలన్నీ ప్రస్తుతం ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. తాము అధికారంలోకి వస్తే రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన 73, 74 రాజ్యంగ సవరణ ప్రకారం.. మూడంచెల స్థానిక సంస్థలకు నిధులు, విధులు, నిర్వహణ పూర్తి స్థాయిలో అప్పగిస్తామని, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రతతోపాటు కనీస వేతనం ఇస్తామని, సర్పంచ్ నుంచి జడ్పీటీసీల వరకు వేతన పెంపుపై చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పెట్టిన ఆ పార్టీ, ఇప్పుడు పల్లెలు నిర్వీర్యం అవుతున్నా నిధులు కేటాయించడం లేదు. ఈ పరిస్థితుల్లో నేడు వేములవాడకు వస్తున్న ముఖ్యమంత్రి పంచాయతీలకు ఏమైనా నిధులు కేటాయిస్తారా..? లేదా..? చూడాలి.
తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెలా 4వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ అన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేయడంతోపాటు ఉపాధి కల్పనా కార్యాలయంలో స్కిల్ డెవలప్మెట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చాలా రకాల ముచ్చట్లు చెప్పారు. ఇప్పటికే కరీంనగర్ ఉపాధి కల్పనా కార్యాలయంలో 18,308 మంది నమోదు చేసుకున్నారు. పెద్దపల్లిలో 20,508 మంది, సిరిసిల్లలో 8వేలు, జగిత్యాలలతో 9వేల మంది నమోదు చేసుకున్నారు. ఇంకా ఉపాధి కల్పన కార్యాలయంలో నమోదు చేసుకోని వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇస్తారా..? లేదా అన్న విషయంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తారా? లేదా..? చూడాలి.
తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న వృద్ధుల పింఛన్‌ను రూ 4వేలకు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 10లక్షల మందికిపైగా వివిధరకాల పింఛన్లు పొందుతున్నారు. నిజానికి ప్రభుత్వం రూ. 4వేలకు పెంచితే, అందులో 99 శాతం మందికి లబ్ధి చేకూరుతుంది. కానీ, దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. పోనీ కొత్త అర్జీలనూ పరిశీలించడం లేదు. ఉమ్మడి జిల్లాలో 17,853 మంది కొత్తగా దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. అందులో 8,153 మంది దివ్యాంగులు, 15వేల మంది వయోవృద్ధులు, 1,200 మంది వితంతువులు, 500 మంది ఒంటరి మహిళలు, ఇతరులు 2వేల మంది వరకు ఉన్నారు. ఈ నెలలో కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుందంటూ ప్రభుత్వం ప్రకటించినా, ఇంకా ఎలాంటి ఉత్తర్వులు విడుదల చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పష్టత ఇస్తారా..? లేదా..? చూడాలి.
అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్, ఇప్పుడు ఏడాది గడుస్తున్నా సంపూర్ణ రుణమాఫీ చేయడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,78,678 మంది రైతులు రుణాలు తీసుకున్నట్టు తేల్చిన సర్కారు, ఇప్పటివరకు 2,39,231 మందికి 1,842.89 కోట్లను మాఫీచేసింది. ఇంకా 1,39,447 మందికి రుణమాఫీ చేయాల్సి ఉన్నది. నిజానికి క్షేత్రస్థాయి లెక్కలు అందుకు భిన్నంగా ఉన్నాయి. సుమారు రెండున్నర లక్షల వరకు రుణమాఫీ జరగాల్సి ఉంటుందని తెలుస్తున్నది. తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరాకు 15వేలు ఇస్తామని చెప్పినా నేటివరకు ఇవ్వడం లేదు. ప్రారంభంలో ఒక సీజన్ మాత్రమే వేసిన సర్కారు, ప్రస్తుతం రెండు సీజన్లలో ఎగనామం పెట్టింది. రైతు భరోసాను పక్కన పెడితే రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలన్న డిమాండ్ వస్తున్నది. దీనిపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.
జగిత్యాల, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి, కథలాపూర్, భీమారం మండలాలతోపాటు కోరుట్ల, మెట్పల్లి మండలాల్లో కలుపుకొని మొత్తం 43,100 ఎకరాలకు సాగునీటిని కల్పించేందుకు ఉద్దేశించింది సూరమ్మ కలికోట రిజర్వాయర్. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఆధారపడి ఎస్ఐపీ స్టేజ్-2లో భాగంగా దాదాపు 400 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఎన్నికల సమయంలో దీనిని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుతోపాటు కుడి, ఎడమ కాలువలు నిర్మించాల్సి ఉన్నది. కాగా, కాలువల నిర్మాణానికి ప్రభుత్వం 10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 520 ఎకరాల భూ సేకరణకు వంద కోట్లకు పైగా నిధులు అవసరం ఉండగా, కేవలం 10 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. ఆ నిధులు మంగళవారం ఉదయం వరకు జగిత్యాల కలెక్టర్ ఖాతాలో జమకాకపోవడం గమనార్హం.
జగిత్యాల, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలోని దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. కేవలం ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కోరుట్లలో జరిగిన బహిరంగ సభ సాక్షిగా ఫ్యాక్టరీని తెరిపిస్తామని అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ కోరుట్ల బహిరంగ సభలో మరోసారి స్పష్టం చేశారు. అయితే, దీనిపై ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ మొదలు పెట్టలేదు. బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించే విషయంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో కొంత హంగామా చేసింది. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చైర్మన్‌గా కమిటీ వేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, తదితరులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ఎన్నికల సమయంలో ఒక్కసారి ముత్యంపేటలో సమావేశం నిర్వహించి తదుపరి ముఖం చాటేశారు.
కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ముందు నుంచి ఊరిస్తూనే ఉన్నది. ఏడాది అయినా ఒక్క కొత్త కార్డు ఇవ్వలేదు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ మాటలను నమ్మి వేలాది మంది కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మాట మార్చింది. కొత్తగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులంటూ తెరపైకి తెచ్చింది. ఈ విషయం కొలిక్కి వచ్చేదెప్పుడు? రేషన్‌కార్డులు జారీ అయ్యేదెన్నడు? అన్నది తేలాల్సి ఉన్నది. మరోవైపు అక్టోబర్ 2 నుంచి రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులంటూ మంత్రులే ప్రకటించారు. అది పెడింగ్‌లోనే ఉంది. ఆహార భద్రత కార్డుల కోసం కరీంనగర్లో 12,998, జగిత్యాలలో 9,100, పెద్దపల్లిలో 14,900 రాజన్న సిరిసిల్లలో 12,500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49,498 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, కండ్లు కాయలు కాసేలా చూస్తున్నారు.