NAGIREDDYPUR | గంగాధర, మార్చి 28: గంగాధర మండలం నాగిరెడ్డి పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఓ పౌల్ట్రీ ఫార్మ్ లో వైరస్ సోకి కోళ్లు మృతి చెందాయి. అయితే ఇది బర్డ్ ఫ్లూ కాదని సాధారణ వైరస్ అని, ఇది ఇతర కోళ్ల ఫారాలకు సోకే అవకాశం లేదని కోళ్ల ఫారం యజమాని తెలిపారు. కాగా వైరస్ సోకి దాదాపు 3 వేల వరకు కోళ్లు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మండలంలో మూడు రోజులుగా వైరస్ సోకి కోళ్లు చనిపోతున్నా స్థానిక వెటర్నరీ సిబ్బందికి విషయం తెలియకపోవడం విడ్డూరమని గ్రామస్తులు ఆరోపించారు. కాగా ఈ విషయం మీడియాకు తెలిసిందని తెలుసుకున్న వెటర్నరీ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే అప్పటికే ఫారం చనిపోయిన కోళ్లను యజమాని అక్కడి నుండి తరలించినట్లు తెలిసింది. దీనిపై పశువైద్యాధికారి సందీప్ రెడ్డిని వివరణ కోరగా తాను శిక్షణ లో ఉన్నానని, తన దృష్టికి రాలేదని తెలిపారు. సిబ్బందిని కోళ్లు చనిపోయిన ప్రదేశానికి పంపగా అక్కడ చనిపోయిన కోళ్లు ఏమీ లేవని సిబ్బంది తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.