చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రెక్కలు ముక్కలు చేసుకొని నేసిన మగ్గం బట్ట, ఆరు నెలల నుంచి గోదాముల్లో మూలుగుతున్నది. 27 చేనేత సహకార సంఘాల పరిధిలో 20 కోట్లకు పైగా విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. కొత్త సర్కారు వచ్చిన తర్వాత అంతా తారుమారు కాగా.. ఖరీదు లేక మగ్గాలు మూతపడ్డాయి. చేద్దామంటే పని లేక.. చేతుల్లో పైసల్లేక నేతన్నల బతుకులు దుర్భరంగా మారాయి. వస్ర్తాలను ‘టెస్కో’ ఖరీదు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని, అప్పుడే సంఘాల్లో కార్మికులకు చేతినిండా పని దొరుకుతుందని సంఘాల పాలకులు దీనంగా వేడుకుంటున్నారు.
ఎలిగేడు, మే 31 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 27 చేనేత సంఘాలు ఉన్నాయి. అందులో కరీంనగర్ జిల్లాలో 19, పెద్దపల్లి జిల్లాలోని కనుకులలో 1, జగిత్యాల జిల్లా కేంద్రంలో 1, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 చొప్పున ఉన్నాయి. కేసీఆర్ సర్కారు ఉన్నంత వరకు వీటి పరిధిలో 1,697 మగ్గాలు నిరంతరం పనిచేసేవి. సుమారు ఐదు వేల మంది చేనేత కార్మికులకు చేతినిండా పని ఉండేది. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) నుంచి సక్రమంగా ముడి సరుకు ఇవ్వడంతో ప్రతి నెలా 3 కోట్లకు పైగా వస్ర్తాలు ఉత్పత్తయ్యేవి. బెడ్షీట్లు, లుంగీలు, టవల్స్, ప్యాంట్, షర్టింగ్ క్లాత్ ఇలా రకరకాల వస్ర్తాలు తయారయ్యేవి. తర్వాత ఈ వస్ర్తాలను తిరిగి టెస్కో ఖరీదు చేసేది. కానీ, ఆరు నెలల్లోనే అంతా తారుమారైంది.
అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు చేనేత మగ్గాలు సక్రమంగానే నడిచాయి. నవంబర్ నెల వరకు ఖరీదులు (ప్రొక్యూర్మెంట్)జరిగింది. కానీ, డిసెంబర్ నుంచి పరిస్థితి మారిపోయింది. కొత్త సర్కారు వచ్చినప్పుటి నుంచి టెస్కో సహకారం కరువైంది. ముడి సరుకు ఇవ్వడం లేదు. ఇటు ఖరీదు చేయడం లేదు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 27 చేనేత సహకార సంఘాల్లో 20 కోట్లకు పైగా విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. దాదాపుగా మరమగ్గాలన్నీ నిలిచిపోయి చేనేత కార్మికులు రోడ్డున పడ్డారు. చేద్దామంటే పనిలేక.. చేతిలో పైసల్లేక తల్లడిల్లిపోతున్నారు.
ఇంత అధ్వానపు పరిస్థితి తాము ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. రూ.కోట్ల విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయి సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు తెచ్చి సంఘాలను నడిపించలేక పోతున్నామని వాపోతున్నారు. చేనేత సంఘాల పరిస్థితి ప్రస్తుత పాలకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని సంఘాల పాలకులు, నేతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఇంతటి దారుణమైన దుస్థితిని తాము ఎన్నడూ చూడలేదని రోదిస్తున్నారు. సర్కారు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆరు నెలల నుంచి ఉత్పత్తయిన వస్ర్తాలన్నీ గోదాముల్లో గుట్టగుట్టలుగా పేరుకుపోయాయి. కోర్కల్ సంఘంలో 1.30 కోట్లు, జమ్మికుంట శతరంజి సంఘంలో కోటి, హుజూరాబాద్‌లో కోటి, ఊటూరు, పచ్చునూరు, బొమ్మకల్ సంఘాల్లో రూ.50 లక్షల చొప్పున 1.50 కోట్లు, వీణవంకలో 70 లక్షలు, బాలాజీ కొత్తపల్లిలో రూ.40 లక్షలు, చొప్పదండిలో 80 లక్షలు, కరీంనగర్ నంబర్ 1, నంబర్ 2లో 1.50 కోట్లు, మన్నెంపల్లిలో 30 లక్షలు, కొత్తపల్లిలో కోటి, కొత్తపల్లి మార్కండేయలో 30 లక్షలు, కొండపల్కలలో 90 లక్షలు, మ్యాక్స్ సొసైటీ, కొత్తపల్లి వినాయకలో 60 లక్షలు, లక్ష్మాజిపల్లిలో 60 లక్షలు, కమలాపూర్‌లో 1.50 కోట్లు, మరిపల్లిగూడెంలో 30 లక్షలు, దుద్దెనపల్లిలో 30 లక్షలు, పొట్లపల్లిలో 35 లక్షలు, శ్రీరాములపల్లిలో 60 లక్షలు, వేములవాడలో 1.20 కోట్లు, మామిడిపల్లిలో60 లక్షలు, హన్మాజీపేటలో 50 లక్షలు, సిరిసిల్లలో 1.50 కోట్ల విలువైన నిల్వలు పేరుకుపోయాయి.
చేనేత సంఘాల పరిస్థితి పూర్తిగా అధ్వానమై పోతున్నది. ఆరు నెలల నుంచి ప్రొక్యూర్మెంట్ లేదు. సంఘాల దుస్థితిని ఏ నాయకుడికి చెప్పినా పట్టించుకోవడం లేదు. నేసిన వస్ర్తా గుట్టలుగా పేరుకు పోయాయి. టెస్కోలో అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పులు చేసి సంఘాలను నడిపే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఖరీదులు బందయ్యాయి. ఎవరిని అడిగినా జవాబుదారీతనం లేదు. చేనేత కార్మికుల బతుకులు దుర్భరంగా ఉన్నాయి. ప్రభుత్వం వ్యవసాయరంగానికి చేయూతనిచ్చినట్టుగా చేనేత రంగానికీ ఇవ్వాలి. అప్పుడే ఈ రంగం బతికి బట్ట కడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి సంఘాలకు నిధులు సమకూర్చాలి. తక్షణం వస్ర్తాల ఖరీదు చేపట్టి ఆదుకోవాలి.
– ఏ సత్యనారాయణ, ఆప్కో మాజీ డైరెక్టర్