Dharmapuri | ధర్మపురి, అక్టోబర్ 30: మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు జగిత్యాల జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు నార్కోటిక్స్, కొకైన్, గంజాయిలాంటి నిషేదిత మత్తుపదార్థాలను గుర్తించేందుకు ధర్మపురి సీఐ రాంనరసింహారెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఉదయ్ కుమార్, రవీందర్, బాంబ్ డిస్పోజల్ టీమ్, పోలీస్ సిబ్బంది జాగిలాలతో గురువారం ధర్మపురి మండల కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
గతంలో ఈ ప్రాంతంలో గంజాయి దొరికిన నేపథ్యంలో మత్తుపదార్థాల అక్రమరవాణా, నిల్వలను కనుగొనేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాలతో ఈ తనిఖీలు చేపట్టారు. ధర్మపురి పట్టణంలోని పాన్ షాపులు , కిరాణం షాపులతో పాటు బస్టాండ్. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ స్క్వాడ్ బృందంతో పరిశీలించారు. అనుమానాస్పద వస్తువులు, ప్యాకేజీలు, సంచులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఐ రాంనర్సింహారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాలను నిర్మూలించడంతో పాటు ధర్మపురిలో భద్రతాచర్యలు మరింత కట్టుదిట్టం చేయడం కోసం తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. గంజాయి మత్తు పదార్థాలు కలిగి ఉన్నా ఇతరులకు విక్రయించినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులు కనిపించినట్లయితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని పట్టవాసులను కోరారు.