రామగిరి, డిసెంబర్ 16: ‘నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తున్నది. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది.’ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. విగ్రహాల రూపురేఖలు మార్చినంత మాత్రాన ఉద్యమ చరిత్రను మార్చలేరని స్పష్టం చేశారు. రామగిరి మండలం సెంటినరీకాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మలిదశ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన గడ్డ రామగిరి గడ్డ అని, ఇక్కడి తెలంగాణ చౌక్ నుంచే సింగరేణి కార్మికులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఎప్పుడు జేఏసీ పిలుపునిచ్చినా..? రామగిరి గడ్డ మీద నుంచే ఈ ప్రాంతంలో తెలంగాణ వాదాన్ని వినిపించారన్నారు.
లేకలేక అధికారంలోకి వచ్చిన పిచ్చి ఆనందంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, ప్రజా పాలనపై దృష్టి పెట్టకుండా పేర్లు, రూపాలను మార్చడంపైనే దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఎవరైనా గొప్పగా ఉండాలని ఆలోచన చేస్తారని, కానీ పాత పద్ధతి అంటూ తల్లిని కూడా అలాగే చూపించడం సీఎంకే సాధ్యమైందని దుయ్యబట్టారు. ఆనాడు మలిదశ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన రామగిరి గడ్డపై త్వరలోనే తెలంగాణ వీర వనిత విగ్రహ ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. అధికారంలోకి రాకముందు ఒక తీరు, వచ్చాక మరో తీరుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. సింగరేణి కార్మికులను సైతం మోసం చేసిందని, వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రామగిరిలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సింగరేణి కార్మికులు, పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.