CES Chairman, Chikkala Rama Rao | సిరిసిల్ల రూరల్, ఆగస్టు 29: వర్షాలు, వరదలతో జిల్లా లో సెస్ సంస్థకు సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. తంగళ్ళపల్లి మండలంలోని క స్బ కట్కూర్, వేణుగోపాల్ పూర్, గండి లచ్చపేట గ్రామాల్లో నష్టపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫర్లను ఆయన సెస్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతరం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడారు. జిల్లాలో సుమారు రూ.50 లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలిపారు. భారీ వర్షాలు వరదలతో విద్యుత్ పరంగా ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. వరదలు వర్షాలు తగ్గినంక పూర్తిస్థాయి నష్టపరిహారం అంచనా వేసి, మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు. వర్షాలతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో విద్యుత్ సిబ్బందికి అధికారులకు సమాచారం అందించాలన్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట పరిధిలో రామంజపురం లో మూడు రోజులుగా విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు.
రామంజపురం కు వెళ్లడానికి వీలులేదని, రెండు వైపులా నీటి ప్రవాహంతో దాటలేని పరిస్థితి ఉందన్నారు. నీటి ఉదృత తగ్గినంక అవసరమైతే రెండో విద్యుత్ లైన్ వేసిన గ్రామానికి విద్యుత్ సరమ అందిస్తామన్నారు. ఈరోజు తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలను పరిశీలించానని, సుమారు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. విద్యుత్తు లైన్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అవసరమైన చోట తక్షణమే ఏర్పాటు చేస్తామన్నారు. వరదలతో సెస్ పాలక వర్గం, సెస్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నామని, అందరీ సహకారంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూశామని పేర్కొన్నారు. ఈ సమావేశం లో సెస్ ఏడీ ఈ శ్రీధర్, ఏ ఈ మధుకర్, సిబ్బంది ఉన్నారు.