Siricilla | రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్, జూలై 24 : ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ బాధ్యత వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ ఆరోపించారు. అమృత శుక్లా కార్మిక భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వంశీ కుటుంబానికి పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేపర్ లీకేజీలపై శాంతియుతంగా నిరసన తెలిపిన ఆర్ఎస్ఎఫ్ విద్యార్థి నాయకులను అడ్డుకోవడం, బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. ఈ ఘటనలో బీజేపీ నాయకులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పేపర్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, జిల్లా నాయకుడు ఎలిగేటి రాజశేఖర్ పాల్గొన్నారు.