ట్రాన్స్‌కో నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్న సెస్ సంస్థ ఇక నుంచి సొంతంగా తయారు చేసుకోవడంపై దృష్టి సారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జర్మనీ కో-ఆపరేటివ్ బ్యాంకు సహకారంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ఇటీవల సిరిసిల్లను సందర్శించిన జర్మనీ ప్రతినిధి బృందం ఇచ్చిన నివేదికతో సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) నూతన ఒరవడి సృష్టించబోతున్నది. సొంతంగా విద్యుత్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షతో రెండు దశాబ్ధాల కిందటే కార్యాచరణ చేపట్టింది. అయితే, సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కాగా, సోలార్ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సోలార్ ప్యానెల్‌ను పెట్టుకునేలా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ప్రస్తుతం సోలార్ విద్యుత్ వినియోగానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సెస్ సొంతంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం, జర్మనీ కోఅపరేటివ్ బ్యాంకు 25 శాతం, వినియోగదారుల వాటాధనం 15 శాతం నిధులతో సొంత కరెంటు తయారీకి అడుగులు పడుతున్నాయి.
సోలార్ పవర్ ప్లాంట్‌తో రోజుకు వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ట్రాన్స్‌కో నుంచి యూనిట్ విద్యుత్ 4.87లకు కొనుగోలు చేస్తుండగా, రామగుండం నుంచి సిరిసిల్ల వరకు వస్తున్న విద్యుత్‌లో 10 మెగావాట్ల లైన్ లాస్ భారం సెస్‌పై పడుతున్నది. సొంతంగా ఏర్పాటు చేసుకోబోతున్న సోలార్ పవర్‌ప్లాంట్ వల్ల 10 మెగావాట్ల విద్యుత్ లైన్‌లాస్ ఉండదు. పైగా యూనిట్ విద్యుత్ 3.30కే లభించే అవకాశం ఉంది. తద్వారా వినియోగదారుడిపై కొంత భారం కూడ తగ్గే అవకాశం ఉన్నది. సోలార్ వపర్‌ప్లాంట్ ఏర్పాటుతో సెస్పరిధిలోని వ్యవసాయ రంగం, మరమగ్గాల పరిశ్రమ, రైసు మిల్లులు, ఇతర రంగాలకు నాణ్యమైన కరెంటు సరఫరా అయ్యే అవకాశముంటుంది. ఇప్పటికే రెండుగ్రామాలకొకటి చొప్పున 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఇంకా కొన్ని చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది.
వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్లలోని మరమగ్గాలకు ప్రభుత్వం 10 హెచ్‌పీ వరకు విద్యుత్ రాయితీ ఇస్తున్నది. పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించాలంటే ఈ రాయితీని 25 హెచ్పీలకు పెంచాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఈఆర్సీకి విన్నవించడంతో పరిశీలించి 25 హెచ్పీలకు రాయితీ పొడిగించింది. ఫలింతగా సుమారు 30 వేల మరమగ్గాల యజమానులు, ఆసాములకు లబ్ధి చేకూరింది. సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుతో మరమగ్గాలకు మరింత లాభదాయకం కానున్నట్లు అధికారులు తెలిపారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరాతో వినియోగదారులకు మెరుగైన సేవలందించాలన్నది మా పాలకవర్గ లక్ష్యం. వ్యవసాయ, మరమగ్గాలు, ఇతర పరిశ్రమల రంగాలను ప్రోత్సహించేందుకు అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం ట్రాన్స్‌కో నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. సోలార్ పవర్ ప్లాంట్ సొంతంగా సంస్థ నుంచి ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం, జర్మనీ కోఆపరేటివ్ బ్యాంకు 25 శాతం,15 శాతం వినియోగదారుల వాటాధనంతో ఏర్పాటు చేసేందుకు పాలకవర్గ సభ్యులందరం కలిసికట్టుగా అడుగులు వేస్తున్నాం. వినియోగదారులకు సోలార్ పవర్ మరింత చౌకగా లభించే అవకాశాలున్నందున ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం.