కాంగ్రెస్ పాలనలో పంచాయతీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. పన్నెండు నెలలుగా గ్రాంట్లు రాకపోవడంతో జీపీలు ఆర్థికంగా చతికిల పడ్డాయి. రోజువారీ పనులకు కూడా పైసా లేక కార్యదర్శులే సొంతంగా జేబుల నుంచి ఖర్చులు పెడుతున్నారు. అసోసియేషన్ నుంచి వస్తున్న సమాచారం చూస్తే.. గడిచిన పన్నెండు నెలల్లో దాదాపు 13 కోట్లకుపైగా డబ్బులను జేబుల నుంచి ఖర్చు పెట్టుకున్నారు. పెట్టిన పైసలు రాక, ట్రెజరీలకు ఇచ్చిన చెక్కులకు మోక్షం లేక, రోజు వారీ పనులు ఆపలేక అప్పులపాలవుతున్నామని కార్యదర్శులు వాపోతున్నారు.
పై నుంచి ఆదేశాలు ఇచ్చే వారే తప్ప ఆర్థిక వనరులను సమకూర్చడంలో అటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఇటు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు గానీ పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు. పంచాయతీలే కాదు, తామూ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరిట కనీస సెలవులు ఇవ్వకుండా పనిచేయిస్తున్న తీరుపై కార్యదర్శుల కుటుంబాల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పట్లో ఈ బాధలకు విముక్తి కలుగుతుందా.. లేదా..? అన్న ఆవేదన కనిపిస్తున్నది.
కరీంనగర్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా నిధులు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నేరుగా విడుదల చేస్తున్నది. 2011 జనాభా ప్రాతిపదికన ప్రతినెలా చిన్న చిన్న పంచాయతీలకు నెలకు 50వేలు, మధ్య రకం పంచాయతీలకు 5 లక్షల నుంచి 10 లక్షలు, మేజర్ పంచాయతీలకు 15లక్షల నుంచి 25లక్షల వరకు నిధులు వస్తాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలనెలా పల్లెప్రగతి కింద నిధులు జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పల్లె ప్రగతికి ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయడంతో జీపీలు కళకళలాడాయి. కానీ, కాంగ్రెస్ పాలనలో గతేడాది జనవరి నుంచి నిధుల మంజూరు దాదాపుగా నిలిచిపోయింది. ఆగస్టు-సెప్టెంబర్‌లో రాష్ట్ర సర్కారు జీపీలకు ఒక నెలలో ఇచ్చే గ్రాంటు విలువలో కేవలం 25 నుంచి 40 శాతం నిధులను ఇచ్చి మమ అనిపించింది. దీంతో పంచాయతీలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. కేంద్రం నిధులు నిలిచిపోవడానికి రాష్ర్ట ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలే అధికంగా ఉన్నాయి.
2019 జనవరి 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు వివిధ దశల్లో జరుగగా.. 2024 ఫిబ్రవరి ఒకటితో పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనను అమల్లోకి తెచ్చింది. నిబంధనల ప్రకారం సర్పంచుల పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగాలి. కానీ. ప్రస్తుత పరిస్థితిని చూస్తే పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి ఉన్నది. ఎన్నికలు నిర్వహించక పోవడంతో కేంద్రం ఆర్థిక సంఘం గ్రాంటును నిలిపివేసింది. ఇదే సమయంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా నిధులు రావడం లేదు.
నిధులు నిలిచిపోయినా పంచాయతీల్లో రోజువారీ పనులు నిర్వహించకపోతే పాలన స్తంభించిపోయే ప్రమాదమున్నది. అంతేకాదు, పారిశుధ్యం, తాగునీరు వంటివి ఆగిపోతే పల్లెలు రోగాల పాలయ్యే ముప్పు ఉన్నది. ప్రజారోగ్యం దృష్ట్యా సాధారణంగా మైనర్ పంచాయతీల నిర్వహణకు నెలకు సుమారు 20వేల నుంచి 25వేలు, మేజర్ పంచాయతీలకు 1.50లక్షల నుంచి 2 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. గతంలో గ్రాంట్స్ రావడంతో ఏ ఇబ్బంది లేకుండా పాలన సాగింది. కానీ, ప్రస్తుతం రోజువారీ ఖర్చులకు కూడా ప్రభుత్వం పైసా ఇవ్వడం లేదు.
కాగా, జీపీల పరిధిలో ఇంటి బిల్లులు, మార్కెట్‌తోపాటు పెనాల్టీలు.. ఇలా వివిధ రూపాల్లో సమకూరే ఆదాయాన్ని జనరల్ ఫండ్ కింద కార్యదర్శులు ట్రెజరీలో జమ చేస్తారు. ఈ డబ్బులను కూడా వినియోగించే అవకాశం లేకుండా పోతున్నది. నిజానికి ఏప్రిల్ నుంచి చెక్‌లు పాస్ చేయడం నిలిపివేశారు. సెక్రటరీల ఒత్తిడి మేరకు తాజాగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న బిల్లులను పాస్ చేశారు. గత ఆగస్టు నుంచి మాత్రం బిల్లులు పెడింగ్‌లోనే ఉన్నాయి. దీంతో చిన్న స్థాయి బిల్లు కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. సిబ్బంది వేతనాలకు మాత్రం అనుమతి ఇస్తున్న ట్రెటరీ అధికారులు, ఇతర బిల్లులను పక్కన పెడుతున్నారు.
ఏడాది కాలంగా 99 శాతం పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఈ పరిస్థితులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. నయాపైసా ఇవ్వకుండా గతేడాది ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ విజయవంతం చేయాలంటూ కార్యదర్శుల మెడపై కత్తిపెట్టి పనులు చేయించింది. అలాగే 12 నెలలుగా జీపీలకు అవసరమైన ఫాగింగ్, బ్లీచింగ్, పారిశుధ్యం, తాగునీరు, స్ట్రీట్‌లైట్స్, బోర్ల రిపేరు, ట్రాక్టర్లకు డీజిల్ లాంటి పనుల కోసం సెక్రటరీలే తమ జేబు నుంచి ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా ఒక్కో కార్యదర్శి తన పంచాయతీ కోసం ప్రతి నెలా తన జేబు నుంచి 10వేల నుంచి 20వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది.
అయితే పెట్టిన బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియకపోగా.. ఖర్చు పెట్టకపోతే ముందుకెళ్లలేని స్థితి ఉన్నది. ఉమ్మడి జిల్లాలో పంచాయతీల నిర్వహణకు జేబుల నుంచి ఖర్చు పెట్టని ఏ ఒక్క కార్యదర్శి ప్రస్తుతం లేడని సెక్రటరీలే చెబుతున్నారు. రోజు వారీ పనులు చేయకపోతే సస్పెండ్ చేస్తామని ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలతో కొంత మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారని, మరికొంత మంది అప్పులు తెచ్చి పెడుతున్నారని వాపోతున్నారు. ప్రధానంగా మహిళా సెక్రటరీలు డబ్బులు సర్దుబాటు చేయలేక, చేసిన అప్పులకు కుటుంబానికి సమాధానం చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రత్యేకాధికారులు పైసా విధిల్చకపోగా, పలు రకాల ఆదేశాలు ఇస్తూ అజామాయిషీ పెంచుతున్నట్టు తెలుస్తున్నది.
తమ ఇబ్బందులను పరిష్కరించి, ఆర్థికంగా తమకు వెసలుబాటు కల్పించాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను కలిసి విన్నవించుకున్నా పట్టించుకునే వారు లేరన్న ఆవేదన వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించి, తాము వెచ్చించిన డబ్బులు తమకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శలు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు కూడా తమనే వాడుతున్నారని, పైగా తర్వాత పూర్తిచేయాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ 31వరకు ఆదివారాలు, పండుగలు అని చూడకుండా.. సెలవులు ఇవ్వకుండా సెక్రటరీలతో పనిచేయించడంపై వారి కుటుంబాల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది.
పంచాయతీల్లో నెలకొన్న పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేయాలి. కనీసం రోజువారీ నిర్వహణ కోసం ప్రతినెలా పంచాయతీలకు నిధులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే కార్యదర్శులు ఆర్థికంగా ఇంకా చితికిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటివరకు సొంతంగా జేబుల నుంచి పెట్టిన డబ్బులు ఇప్పించాలని అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తాం. వాటి ప్రకారం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.
అయితే పండుగ, సెలవు రోజుల్లో తమను విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే నిరంతర డ్యూటీతో కుటుంబానికి కనీస సమయం ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ 31వరకు మేం నిర్వహించిన విధులే దీనికి నిదర్శనం. దీంతో మా కార్యదర్శుల కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయి. దయచేసి మా సమస్యను అర్థం చేసుకొని ఆర్థిక ఇబ్బందులను తొలగించాలి. సెలవు రోజుల్లో అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగానే మాకు విధుల నిర్వహణ లేకుండా చూడాలి.
– జీ అజయ్‌కుమార్, కరీంనగర్ జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు