
Sunke Ravishankar | చొప్పదండి, ఏప్రిల్ 29: ధాన్యం కొనుగోలులో రైతులకు నూతన విధానాన్ని తీసుకువచ్చి ధాన్యం కొనుగోళ్లు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న పీఎం మోడీ, సీఎం రేవంత్ రెడ్డిలు రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు బత్తిని సంపత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని మాట్లాడారు. రైతులు 25 రోజుల కింద పొలాలు కోసి కల్లాలలో పోసిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకుండా, కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, కొబ్బరికాయలు కొట్టుడు కాదని కొనుగోలు చేయాలని హితవుపలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను వెన్నుపోటు పొడుస్తుందని, 25 రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీపీఎస్ నూతన విధానాన్ని తీసుకువచ్చిందని, జీపీఎస్ ఆన్ లైన్ చేసుకుంటే ట్రక్ షీట్ లో ఉంటేనే వాహనం వస్తుందని, ట్రక్ షీట్ విధానం ద్వారా రైతులు నష్టపోతున్నారని అన్నారు.
ధాన్యం ఈసారి చాలా బాగా పండిందని రైస్ మిల్లులు అరాకొరగా అలాట్మెంట్ చేసి పూర్తిస్థాయిలో రైస్ మిల్లులను అలాట్మెంట్ చేయకపోవడంతో రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఎక్కడ పోయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వమే కొర్రీలు పెడితే రైతులు వడ్డీకి పావు షేర్ లెక్క బయట దళారులకు ధాన్యాన్ని అమ్ముకోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని మేము తీసుకోమని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమారఖ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చెబుతూ ధాన్యాన్ని మేము కూడా కొనుగోలు చేయమని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తడిసిన ధాన్యం, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేశామని చెప్పారు. వారం రోజుల లోపు రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేశామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించి కేసీఆర్ రైతు బాంధవుడు అయ్యాడని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు మూడు పంటలకు రామ్ రామ్ పెట్టి ఎగవేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానంతో యూరియా కొంటే ఇంకొకటి కొనాలని లింకు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వీటన్నిటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అమలు చేసినటువంటి విధానాలు అమలు చేసేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ట్రక్ షీట్, ఆన్ లైన్ విధానం, జీపీఎస్ పద్ధతిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యాన్ని రెండు రోజులలో పూర్తిస్థాయిలో పాత పద్ధతి లో కొనుగోలు చేయకపోతే చొప్పదండి నియోజకవర్గం లోని రైతులందరు పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టి కలెక్టరేట్ ను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇంచార్జ్ ఎస్సై వంశీకృష్ణ ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.