CC Roads | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 29 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలకు మంజూరయ్య నిధులతో, జిల్లాలోని పలుచోట్ల నిర్మించిన అంతర్గత రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో హడావుడిగా వేసిన వాటి పక్కన మొరం నింపలేదు. దీంతో ఆయా చోట్ల తరచుగా ప్రమాదాలు జరుగుతుండగా, గ్రామాల్లోని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
అంతర్గత దారులన్నీ 8 ఫీట్లకు మించి నిర్మించకపోగా, మూడు, నాలుగు చక్రాల వాహనాలతో పాటు భారీ వాహనాలు ఆ రోడ్డుపై ఎదురైతే ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు దిగితే అంతంలో వాహన టైరు బరువుకు రోడ్డు అంచు ధ్వంసం అవుతుండటం అనివార్యమవుతుండగా, అనాలు కూడా డ్యామేజీ అవుతున్నాయని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధ్వంసమైన సీసీరోడ్డు అంచు క్రమేపి మధ్యలోకి విస్తరించి, గుంతలు ఏర్పడేందుకు ఆస్కారంగా మారుతున్నాయని ఆయా గ్రామాల్లోని ప్రజలు పేర్కొంటున్నారు.
అసలే నగుబాటైన నాణ్యతతో నిర్మించిన ఈ రోడ్లు సైడ్ బర్ము పోయక దెబ్బతింటుండటంతో వీటి నిర్మాణం మూడు నాళ్ళ ముచ్చటగానే మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న ఈ రోడ్లు నాలుగు రోజులకే మట్టి పాలవుతుండగా, వీటికి మళ్లీ మరమ్మత్తులు చేపట్టేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు గాలికి..ఇష్టారాజ్యంగా పనులు
ఈ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే సైడ్ బర్మ్స్ పూర్తి చేయాలని, నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు విరుద్ధంగా గుత్తేదారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముడి సరుకు ధరలు పెరిగాయనే సాకుతో, గుతేదారులు సిసి రోడ్లు నిర్మించి చేతులు దులుపుకుంటున్నారని పలువురు మండిపడుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అర్థించాలనే భావనతో పనులు చేపడుతున్నారని, చేసిన పనులు పరిశీలిస్తే స్పష్టమవుతుందని పలువురు సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. హడావుడి పనులతో నాలుగు నెలల క్రితం నిర్మించిన రహదారులు కూడా పగుళ్లు పట్టగా, వాటి నాణ్యతపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
నిర్మాణ పనులు దగ్గరుండి పర్యవేక్షించాల్సిన సంబంధిత యంత్రాంగం కూడా చోద్యం చూస్తుండటం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత అంశంపై అధికారులను ప్రశ్నిస్తే గుత్తేదారులకే వత్తాసు పలుకుతున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సైడ్ బర్మ్స్ పూర్తి చేస్తేనే ఎంబి రికార్డులు చేయాల్సి ఉండగా, క్యూరింగ్ కూడా పూర్తి కాకుండానే చాలామందికి బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా, ప్రస్తుతం విడుదలవుతున్న నిధులు సిసి రోడ్ల నిర్మాణానికి సరిపోకపోవడంతో, సైడ్ బర్మ్స్ వేయటం లేదంటూ గుత్తేదారులను సమర్థిస్తుండటం కొసమెరుపు.
రహదారుల నిర్మాణ విధివిధానాలపై ఆరా తీయడంతో గ్రామపంచాయతీలకు విడుదలయ్యే నిధుల నుంచి మొరం పోయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించినట్లు పేర్కొంటుండడం గమనార్హం. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 825 సీసీ రోడ్లు వివిధ గ్రామాల్లో మంజూరు కాగా, వీటి నిర్మాణం కోసం రూ.55 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు 600 పై చిలుకు రోడ్లు పూర్తికాగా, ఏ ఒక్క రోడ్డుకు కూడా సైడ్ బర్మ్ వేయలేదని తెలుస్తోంది. ఇదేమి పట్టించుకోని అధికారులు గుత్తేదారులతో ఉన్న సఖ్యత మూలంగా వెంట వెంటనే బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
బిల్లులు రాగానే సైడ్ పూర్తి చేయాలని సూచించాం : రాజేంద్ర ప్రసాద్, పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్, కరీంనగర్
సీసీ రోడ్ల బిల్లులు తీసుకోగానే సైడ్ బర్న్స్ కూడా పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించాం. వాళ్లు అంగీకరించారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు చేశారు. ప్రమాదకరంగా ఉన్నచోట వెంటనే మొరం పోయించే ఏర్పాటు చేస్తాం.