కలెక్టరేట్, మార్చి 28 : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన అంతర్గత రహదారుల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో రెండు రోజులు మాత్రమే గడువున్నా, అత్యధిక పనులు ప్రారంభించకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నది. మరో వైపు రహదారుల నిర్మాణానికి కేటాయించిన నిధులు వెనుక్కువెళ్లే ప్రమాదం ఉండగా, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 825 సీసీ రోడ్లు మంజూరు కాగా, వీటికి రూ.55కోట్లు కేటాయించారు. వీటిని ఈనెల 31లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 625 పనులు మాత్రమే ప్రారంభించారు. వీటిలో 364 పనులు పూర్తయ్యాయి. ఇంకా 261 కొనసాగుతున్నాయి. మరో 200 సీసీ రోడ్ల పనులు ఇప్పటికీ మొదలే పెట్టలేదు. గ్రామాల్లో చేపట్టే అంతర్గత రహదారులు, భవనాల నిర్మాణ పనులు సాధారణంగా వేసవికి ముందే ప్రారంభిస్తారు. ఇంకా మిగిలిపోతే ఆర్థిక సంవత్సరం ముగింపులో వాటికి అనుమతులు మంజూరు చేస్తారు.
సీసీ రోడ్ల నిర్మాణ పనులు గుత్తేదారులు హాట్కేకులుగా భావిస్తారు. వాటి కోసం పోటీ పడతారు. అయితే, గతేడాది నుంచి మాత్రం గుత్తేదారులు ముందుకు రావడం లేదని తెలుస్తున్నది. ఉపాధి నిధులతో చేపట్టే పనులకు బిల్లులు సకాలంలో రాకపోవడం, అడ్డగోలుగా మామూళ్లు ఇవ్వాల్సి రావడంతోపాటు, చేపట్టిన పనులకు జీఎస్టీ, గ్రామాల్లోని చిన్నా, చితక నాయకులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సి రావడంతో ఇక మిగిలేది ఏమీ లేకపోవడంతో, వాటిపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. ఇంతా చేస్తే గ్రామాల్లో రోడ్లపై నుంచి వెళ్లే కేజ్వీల్ ట్రాక్టర్లతో రోడ్లు ధ్వంసమవుతుంటే, ఆ బాద్నామ్ తమపైకి వస్తుందనే భయంతో పనులకు మొగ్గుచూపడం లేదని గుత్తేదారులు పేర్కొంటున్నారు. జరుగుతున్న పనులపై కూడా క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేక వాటి నాణ్యతపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఇంకా ప్రారంభించని పనులపై కూడా అధికారులు పట్టింపులేనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమని పదే పదే ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వ నేతలు, ఆచరణలో శ్రద్ధ చూపకపోవడంతోనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు వంద శాతం పూర్తికి కృషి చేస్తాం. ఎక్కడా నాణ్యత లోపం లేకుండా సంబంధితాధికారులు పర్యవేక్షిస్తున్నారు.