Munjapalli | మానకొండూర్ రూరల్, మే 24 : అగ్ని ప్రమాదంలో ఓ పశువుల కొట్టంలో ఉన్న రెండు పశువులు సజీవ దహనం కాగా, మరో ఆవు తప్పించుకుంది. ఈ సంఘటన మానకొండూరు మండలంలోని ముంజపంల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామ శివారులో అదే గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీధర్ రెడ్డికి చెందిన పశువుల కొట్టం ఉంది. అందులో శ్రీధర్ రెడ్డి తండ్రి పశువులను కట్టేసి, వాటికి మేతను వేసి వచ్చాడు. అతను ఇంటికి వచ్చిన అరగంట వ్యవధిలోనే పశువుల కొట్టం కాలిబూడిదైంది. అందులో ఉన్న రెండు ఆవులు, ఒక దూడలు ఉన్నాయి. కొట్టం కాలడంతో అందులో ఉన్న ఆవు (గర్భిణితో ఉన్నది), ఒక దూడలు సజీవ దహనమయ్యాయి.
మరో ఆవు ప్రమాదం నుండి తాడు తెంపుకొని తప్పించుకుంది. అటుగా వెళ్తున్న యువకులు ఈత కోసం వచ్చే వారు గమనించి సంఘటన విషయాన్ని శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు పశువులను చూసి బోరున విలపించారు. పశువుల కొట్టంతో పాటు ప్రక్కన ఉన్న పశుగ్రాశం కట్టలు, పెంట కుప్ప సైతం కాలి బూడిదయ్యాయి. కాలుతున్న పశుగ్రాశం కట్టలను గ్రామస్తులు నీటిని తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు, అధికారులుకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా నిప్పంటిచారా..? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిసింది. ఇదే కొట్టంలో గత సంవత్సరం కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పుడు పశువులు తెంపుకొని బయటపడ్డాయి. మళ్లీ ఇలాంటి సంఘటననే జరగడంతో గ్రామంలో భయాందోళనలకు లోనవుతున్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.