Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 5: గోదావరిఖని నగరంలోని రోడ్లపై తిరుగుతున్న పశువులను గోశాలకు తరలించామని రామగుండం నగర పాలక సంస్థ ప్రకటించింది. కానీ ఇది కేవలంల ప్రకటనల వరకేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే… నగరంలో రోడ్లపై యథేచ్ఛగా పశువుల సంచారం ఏమాత్రం తగ్గకపోవడమేనని వాపోతున్నారు. గత చాలా కాలంగా గోదావరిఖని నగరంలో ప్రధాన కూడళ్లు, రోడ్లపై పదుల సంఖ్యలో పశువులు తిష్టవేసి ఉండటంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని గమనించిన నగర పాలక సంస్థ కమిషనర్ పక్షం రోజుల కిందట వీటిని గోశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పశువుల యజమానులకు సైతం హెచ్చరిక జారీ చేశారు.
రోడ్లపై తిరుగుతున్న పశువులను సంజయ్ గాంధీ నగర్లో గల గోశాలకు తరలించామనీ, పశువుల సంబంధీకులు రూ.4 వేలు జరిమానాతోపాటు రోజుకు నిర్వహణ ఛార్జీలు రూ.200 చొప్పున చెల్లించి తీసుకవెళ్లాలని ఈనెల 1వ తేదీన ప్రకటన జారీ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇటు చూస్తే రోడ్లపై యథావిధిగా పశువులు సంచరించడం చూసి స్థానికులు నివ్వెరపోతున్నారు. నగరంలోని జవహర్ నగర్ లో ఆదివారం ప్రధాన రోడ్లపై పశువులు సంచరిస్తూ వాహన చోదకులను ఇబ్బందులకు గురి చేశాయి. దీనితో స్థానికులు నగర పాలక సంస్థ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రోడ్లపై తిరుగుతున్న పశువులను సైతం గోశాలకు తరలించి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.