కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారులు 21వ పశుగణనకు సర్వం సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వరకు నాలుగు నెలలపాటు సర్వే చేపట్టనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 101మంది ఎన్యుమరేటర్లు, పర్యవేక్షణ కోసం 30మంది వైద్యులకు బాధ్యతలు అప్పగించారు. గణన ఏ విధంగా చేపట్టాలో గురువారం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
కరీంనగర్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ఐదేండ్లకోసారి పశుగణన నిర్వహిస్తున్నది. 2018లో చివరిసారిగా 20వ పశుగణన చేపట్టింది. ఈ లెక్కన 2023లోనే పశుగణన చేపట్టాల్సి ఉండేది. కానీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసింది. ఏడాది ఆలస్యంగా ఇప్పుడు చేపడుతున్నది. కరీంనగర్ జిల్లాలో పశు సంవర్ధకశాఖ పరిధిలో 313 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో డీవీహెచ్, ఏవీహెచ్తోపాటు 37ఎస్సీ ఏహెచ్‌లు, 4 ఎంవీసీఎస్లు, 34 గ్రామీణ పశు వైద్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో ఉన్న ప్రతి పశువును గణన చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
2018లో 18,24,871పశు సంపద
చివరిసారిగా 2018లో పశుగణనలో చేపట్టారు. అప్పుడు 82,412 తెల్లజాతి పశువులు, 95,344 నల్ల జాతి పశువులు, 6,38,706 గొర్రెలు, 92,687మేకలు, 6,573 పందులు కలిపి కరీంనగర్ జిల్లాలో మొత్తం 18,24,871 పశు సంపద ఉన్నట్లు తేల్చారు. ఇంకా దేశీయ కోళ్లు, ఫౌల్ట్రీ కోళ్లు, బాతులు, కుందేళ్లు, కుక్కలు, పిల్లులు, గాడిదలు, గుర్రాలు, పావురాలు, నెమళ్లు, చిలుకలను కూడా లెక్కిస్తారు. పశువుల్లో ఆవులు, ఎద్దులు, బర్రెలు, దున్నపోతులు ఇలా విడివిడిగా లెక్కిస్తారు. వీధి పశువులను కూడా లెక్కించనున్నారు.
గణన మొత్తం ఆన్లైన్లోనే..
ఈ సారి పశుగణన పూర్తిగా ఆన్లైన్లో చేపడుతున్నారు. ప్రతి ఎన్యుమరేటర్‌కు ట్యాబ్ ఇస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో 71 కాలంతో కూడిన ఫార్మెట్‌ను అందుబాటులో ఉంచారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికెళ్లి పశువులు, పెంపుడు జంతువులు, పక్షులు, దేశీయ, ఫౌల్ట్రీ కోళ్లను లెక్కిస్తారు. ఇలా ప్రతిదీ లోకేషన్లో ఉండి అప్లోడ్ చేసి సూపర్వైజర్లకు పంపిస్తారు. సూపర్వైజర్లుగా ఉన్న పశు వైద్యులు పరిశీలించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. నాలుగు నెలలపాటు పశుగణన జరుగుతుంది. సూపర్వైజర్లు ఆన్లైన్ అప్లోడ్ చేయగానే కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లిపోతుంది. ప్రతి ఎన్యుమరేటర్ 1,500గృహాల్లో ఈ గణన చేపట్టాల్సి ఉంటుంది.
శిక్షణ తర్వాత గణన
జిల్లాలో పశుగణన చేపట్టే పశు సంవర్ధక శాఖ అధికారులు, సిబ్బందికి నేడు కరీంనగర్లో ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో పశువుల వివరాలు అప్లోడ్ చేసే విధానంపై 101మంది ఎ న్యుమరేటర్లు, 30మంది సూపర్వైజర్లకు ట్రై నిం గ్ ఇస్తారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుం చి డిసెంబర్ 31 వరకు ఈ గణన చేపట్టనున్నారు.
పకడ్బందీగా చేపడుతాం
జిల్లాలోని పశువులు, కోళ్లు, పెంపుడు జంతువులు, పక్షులను గణించేందుకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. వచ్చే నెల 1నుంచి ఈ గణన ప్రారంభిస్తున్నాం. ఇందుకోసం 101మంది ఎన్యుమరేటర్లు, 30మంది సూపర్వైజర్లను నియమించాం. వీరికి నేడు (గురువారం) శిక్షణ ఇస్తున్నాం. పశుగణన పకడ్బందీగా చేపడుతాం. జిల్లాలో మునుపటి కంటే ఈ సారి పశువుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.
– పీ శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి పశు వైద్యాధికారి (కరీంనగర్)