రామగిరి, మే 2 : సింగరేణి భూనిర్వాసిత గ్రామాలైన పెద్దంపేట, మంగళపల్లె గ్రామాల ప్రజలకు రామగిరి మండల రెవెన్యూ శాఖ అధికారులు కులం, ఆదాయం, నివాసం ఓబీసీ సర్టిఫికెట్ల జారీని నిలిపివేశారు. తాము పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తుండడంతో ఇదేంటని ప్రశ్నిస్తే కలెక్టర్ ఆదేశాలని చెబుతున్నారని రెండు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉన్నత విద్యకు అవసరమైన సర్టిఫికెట్లు లేక విద్యార్థులు చాలా నష్టపోతున్నారు.
పెద్దంపేట గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఎంబీబీఎస్ పూర్తిచేసి పీజీ నీట్‌కు దరఖాస్తు చేయాలనుకున్నది. మరో యువకుడు గేట్ ఉత్తీర్ణుడై ఐఐటీ, ఎన్ఐటీలో ఎంటెక్ కోసం సన్నద్ధమవుతున్నాడు. కానీ, అవసరమైన సర్టిఫికెట్లు లేక ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో మనోవేదన చెందుతున్నారు. ఇది తమ భవిష్యత్తుకు సంబంధించిన విషయమని, ప్రభుత్వమే అడ్డుగా నిలవడం బాధాకరమని వాపోతున్నారు.
సింగరేణి కంపెనీ ఇంకా నష్టపరిహారం ఇవ్వకముందే భూములు ఎలా ఖాళీ చేస్తామని గ్రామస్తులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం తమను ఖాళీ చేయాలంటూ హుకుం చేస్తున్నారని, చదువుకుంటున్న తమ పిల్లలకు కుల, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని దీంతో తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.