జగిత్యాల, జనవరి 11 : అక్రమంగా కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని, ధైర్యంగా ఎదుర్కొంటామని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్‌పై కేసుల విషయంలో చూపిస్తున్న స్పీడ్, హామీల అమలు విషయంలో చూపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈ-రేస్ కేస్ విషయంలో కావాలని కేటీఆర్‌పై అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా ఎదురోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, గ్యారంటీలు, హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుతున్నందున కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతూ ప్రజల దృష్టిని మరలుస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంటున్నారని.. అయితే, కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పాలని హితవుపలికారు.
కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవితల గురుంచి అనుచితంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ కవిత, మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సహకారంతో రోళ్లవాగు ప్రాజెక్ట్‌ను పునరుద్దరించి 0.25 టీఎంసీ నుంచి ఒక టీఎంసీకి పెంచారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు కమీషన్ల ప్రాజెక్టు అనడం సరికాదని, కావాలంటే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, జగిత్యాల రూరల్ అధ్యక్షుడు ఆయిల్నేని ఆనంద్‌రావు, సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజు, రాయికల్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్ యాదవ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ సాగి సత్యం రావు, చాంద్ పాషా, నరేశ్, వొడ్నాల జగన్, రమేశ్, చందు, సత్యం పాల్గొన్నారు.