Vemulawada | వేములవాడ, మార్చి 3 : ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణం పై అక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి క్షేమ సమాచారాలపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలకు లోనవుతున్నారు. నాలుగు రోజులుగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ వారి కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అర్ధరాత్రి అయినా ఫోన్ శబ్దం రాగానే లేచి ఏ ఆపద సంభవించింది అని నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు ఆవేదనతో వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం నుండి దుబాయ్, సౌదీ, కువైట్, ఖతార్, బైరాన్, ఒమాన్ తదితర దేశాలలో జీవనోపాధి కోసం వెళ్ళిన వేలాదిమంది వెళ్లి అక్కడ ఉంటున్న విషయం తెలిసిందే. అకస్మాత్తుగా యుద్ధం రావడంతో అమెరికా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని పరుగు దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులు మీడియాలో వస్తున్న కథనాలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పేలుడు వీడియోలతో ఇక్కడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేములవాడ పట్టణంలో మంగళవారం పదుల సంఖ్యలో కుటుంబాలు ఒక దగ్గరికి చేరి విదేశాలలోని వారి కుటుంబ సభ్యుల వివరాలను ఆరతిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎప్పటికప్పుడు వీడియో కాల్ ద్వారా, ఫోన్లో ద్వారా క్షేమ సమాచారం తెలుసుకుంటున్నప్పటికీ మనసులో మాత్రం ఏదో రకమైన బాధ ఉంటుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే విదేశాలలో ఉన్న వారి కుటుంబ సభ్యులు కూడా నిత్యం బాంబులు పడుతున్న అక్కడి ప్రభుత్వాలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న శిధిలాలు పడుతున్న సమయంలోనే తాము భయాందోళన గురవుతున్నామని చెబుతున్నట్లుగా కుటుంబ సభ్యులు వివరించారు. అయితే వారి కుటుంబ సభ్యులను క్షేమంగా స్వదేశానికి వచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కన్నీటి పర్యంతమై వేడుకుంటున్నారు.