నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాల్సిన పలువురు ప్రైవేట్ వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. కాన్పు కోసం దవాఖాన మెట్లెక్కితే చాలు.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కడుపు కోసి బిడ్డను చేతిలో పెడుతున్నారు. ప్రసవాల్లో పది శాతం వరకే సిజేరియన్లు చేయాలని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తున్నా.. మరోవైపు అధికారులు హెచ్చరిస్తున్నా ఏ మాత్రం లెక్కచేయడం లేదు. ఆపరేషన్లతో మహిళల జీవితాల్లో అనేక ఆటుపోట్ల్లు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదు.
ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక సిజేరియన్లు కరీంనగర్లోనే జరుగుతుండగా, కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు కేరాఫ్లా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్లో జరిగే ప్రతి 100 డెలివరీల్లో 87 శాతం ఆపరేషన్లు చేస్తుండగా, రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఏకంగా ఇక్కడకు వచ్చి సమీక్షించడం, చర్యలకు ఆదేశాలు జారీ చేయడం పరిస్థితికి అద్దం పడుతున్నది.
కరీంనగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డ కన్నా సాధారణ ప్రసవం ద్వారా పుట్టిన బిడ్డకే ఎక్కువ తెలివి తేటలుంటాయని యూనిసెఫ్ గతంలోనే తేల్చి చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం చూసినా.. ప్రసవాల్లో కేవలం 10 శాతం వరకే సిజేరియన్లకు అనుమతి ఉన్నది. అయినా సిజేరియన్ల విషయంలో పలువురు జిల్లా వైద్యుల తీరు ఏమాత్రం మారడం లేదు.
కాసుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారనే విమర్శలు వస్తున్నా.. పట్టించుకోవడం లేదు. గర్భిణులు దవాఖాన మెట్లెక్కితే చాలు ఏదో ఒక కారణం చెప్పి ఆపరేషన్లు చేసేస్తున్నారు. ఒక్కో పెషేంట్ నుంచి 50వేల నుంచి ఆపైనే దండుకుంటున్నారు. 2017లో విడుదలైన సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం.. ఆనాడు 63.4శాతం సిజేరియన్లు చేసినట్టు వెల్లడైంది. దీనిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు వైద్యులకు చెప్పినా తమ తీరు మార్చుకోలేదు. తిరిగి 2018 నాటికి ఆ కోతలు ఏకంగా 81.1 శాతానికి పెరగడం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థమవుతున్నది. ముఖ్యంగా ప్రైవేట్లో సిజేరియన్లకు అడ్డూ అదుపులేకుండా పోతుండగా, ఈ దందాకు అడ్డుకట్ట పడడం లేదు.
నిజానికి సిజేరియన్లు ఏయేటికాయేడు తగ్గాలి. ప్రభుత్వం రంగంలో ఆ దిశగా కొంత మేరకు అడుగులు పడుతున్నా.. ప్రైవేటులో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. కరీంనగర్ జిల్లాలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూస్తే ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో కలిపి మొత్తం 9.229 ప్రసవాలు జరిగాయి. అందులో సాధారణ ప్రసవాలు 2,678 (29.01 శాతం) కాగా, సిజేరియన్లు 6,551 (70.98శాతం) జరిగాయి.
ఈ మొత్తం ఆపరేషన్లలో 5,190 ప్రభుత్వ దవాఖానల్లో జరుగగా, అందులో సిజేరియన్లు 3,044 (58.65 శాతం), సాధారణ ప్రసవాలు 2,146 (41.34 శాతం) అయ్యాయి. ఇక ప్రైవేట్లో 4,039 ప్రసవాలు జరిగితే, అందులో సాధారణ ప్రసవాలు కేవలం 532(13.12శాతం) మాత్రమే. సిజేరియన్లు 3,507 (86.82 శాతం) జరిగాయి. మామూలు మౌలిక సదుపాయాలున్న ప్రభుత్వ దవాఖానల్లోనే 55 శాతం సాధారణ ప్రసవాలు చేస్తుంటే.. ప్రైవేట్లో ప్రతి 100 మందిలో 87 మందికి సిజేరియన్లు చేస్తుండడం, తీవ్రంగా పరిగణించాల్సిన అవసరమున్నది.
సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే చెబుతున్నది. కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నది. రాష్ట్రంలో పరిస్థితి కాస్త మెరుగైనప్పటికీ కరీంనగర్ జిల్లాలో మాత్రం మార్పు రావడం లేదు. అందులోనూ కరీంనగరంలోని పలు ప్రైవేట్ దవాఖానలకు చెందిన వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. ఎవరైనా అడిగితే వివిధ కారణాలను చూపి తప్పించుకుంటున్నారు. కొంత మంది ముహూర్తం చూసుకొని, ఆ సయమానికి బిడ్డ పుట్టేందుకు సిజేరియన్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, తాము కాదంటే ఇతర దవాఖానకు వెళ్తామంటున్నారని, అందుకే చేయాల్సి వస్తున్నదని ఓ సీనియర్ వైద్యురాలు చెబుతున్నారు.
అలాగే సాధారణ కాన్పులకు నేటి మహిళలు కొంత భయపడుతున్నారని మరో వైద్యురాలు చెప్పారు. నార్మల్ డెలివరీ సమయంలో ఉండే ఇబ్బందులను సినిమాల్లో ఎక్కువగా చూపుతున్నారని, వాటిని చూసి భయపడి సిజేరియన్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని మరికొంత మంది వైద్యులు చెబుతున్నారు. వైద్యులు చెబుతున్నట్టుగా ఒత్తిడి ఉన్న మాట వాస్తమే అయినా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాల్సిన బాధ్యతను విస్మరించడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పేషెంట్లు చెప్పిన కారణాలను సాకుగా చూపుతూ.. కాసుల కోసం కత్తెర్లకు పని చెబుతున్నారని విమర్శిస్తున్నారు.
హైదరాబాద్లోని మహిళల కోసం ఏర్పాటు చేసిన ఒక కార్పొరేట్ దవాఖానలో వైద్యులపై ఎంత ఒత్తిడి వచ్చినా సాధారణ ప్రసవాలనే ప్రోత్సహిస్తూ కౌన్సెలింగ్ ఇస్తున్నారని, సదరు దవాఖానలో 80 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయని పేర్కొంటున్నారు. అక్కడ ఎలా సాధ్యం అవుతున్నదని, ఇక్కడ మాత్రం ఎందుకు ఆపరేషన్లు పెరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. పేషంట్లు అయినా, వారి బంధువులు అయినా.. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా తలొగ్గకుండా సాధ్యమైన మైరకు కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ ప్రసవాలవైపు ప్రోత్సహించాల్సిన అవసరం కచ్చితంగా ఉన్నదని స్పష్టం చేస్తున్నారు.
ప్రైవేట్ దవాఖానల్లో విచ్చలవిడిగా జరుగుతున్న సిజేరియన్ల వ్యవహారంపై ఇటీవల వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆగ్రహించారు. గతంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఆయన ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. సిజేరియన్ల విషయమై ఇటు వైద్యులతోనూ అటు జోతిష్య పండితులతో సమావేశాలు నిర్వహించారు.
ఇటువంటి వాటికి ముహూర్తాలు పెట్టరాదని, సదరు పండితులను పిలిచి మరీ చెప్పారు. అంతేకాదు, సదరు జోతిష్య పండితులపై నిఘా పెట్టారు. దీంతో ఆపరేషన్లు అప్పట్లో కొంత తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా ఉన్న కర్ణన్, సిజేరియన్లను సీరియస్గా తీసుకొని బుధవారం ప్రత్యేకంగా నగరానికి వచ్చారు. సంబంధిత అధికారులతో సమీక్షించి, ఈ తరహా కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
అనవసర సిజేరియన్ల కట్టడికి చర్యలు తీసుకుంటాం. అందుకోసం ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపుతాం. నెలవారీగా జరిగిన సీ సెక్షన్ ఆపరేషన్ల తెప్పించి వాటిపై ఆడిట్ నిర్వహిస్తాం. ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదా..? లేదా..? అన్న అంశంపై నిపుణుల ద్వారా తెలుసుకొని సదరు దవాఖానలపై చర్యలు తీసుకుంటాం. నేనొక్కటే చెబుతున్నా అవసరమైతే తప్ప ఆపరేషన్లు చేయద్దు. అనవసరంగా చేస్తే చర్యలుంటాయని వైద్యులను హెచ్చరిస్తున్నా. ముహూర్తాల పేరిట ఆపరేషన్లు చేయించుకుంటూ ప్రసవాలు చేయడం మంచిది కాదు. వైద్యులు ఇటువంటి వాటికి స్వస్తి పలకాలి.
– లలితాదేవి, జిల్లా వైద్యాధికారి (కరీంనగర్)