Bye bye Ganesha..| కోల్ సిటీ, సెప్టెంబర్ 5: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులతో విశిష్ట పూజలందుకున్న బొజ్జ గణపయ్యలను శుక్రవారం నిమజ్జనంకు తరలించారు. గణపతి బొప్పా మోరియా అంటూ యువకులు కేరింతల మధ్య గణనాథులను ఊరేగింపుగా తీసుకవెళ్లారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ కూడళ్లలో గల వినాయక మండపాల వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పూజా సామగ్రి, లడ్డు వస్త్రాలు తదితర వాటికి వేలం పాట నిర్వహించారు. భక్తులు పోటాపోటీగా వేలం పాడి దక్కించుకున్నారు.
అనంతరం ప్రత్యేక వాహనాల్లో ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు నిర్వహించారు. మహిళలు, యువకులు, చిన్నారులు, పెద్దలు నృత్యాలు చేస్తూ వీడ్కోలు పలికారు. దారి వెంట భక్తులు, మహిళలు గణనాథులకు మంగళ హారతులతో నీరాజనాలు. పలికారు. నగరంలోని ఆయా కూడళ్ల నుంచి శోభాయాత్రగా తరలివచ్చిన గణనాథులను గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో వీహెచ్ పి ఆధ్వర్యంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. అనంతరం సీరియల్ నంబర్ల ప్రకారం గణనాథులను గోదావరి నదికి నిమజ్జనం కోసం సాగ నంపారు. కాగా, గోదావరిఖని చౌరస్తా భక్త జనులతో కిక్కిరిసిపోయింది.
ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ సారథ్యంలో సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పెట్రోలింగ్ బృందాలు నగరంలో గస్తీ తిరుగుతూ యువతను కట్టడి చేశారు. నిమజ్జనం వేడుకలు వేడుకలు తెల్లవారు జాము వరకు కొనసాగాయి.