Gangadhara | గంగాధర,ఏప్రిల్ 5: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని మండలంలోని బూరుగుపల్లి రేషన్ డీలర్ గడ్డం సరోజనను రెవెన్యూ అధికారులు తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. ప్రొటోకాల్ సాకుతో విధుల నుండి తొలగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈనెల 2న గంగాధర మండలం మంగపేటలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధికారికంగా ప్రారంభించిన తర్వాతనే మిగతా గ్రామాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించాలని రెవిన్యూ అధికారులు రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బియ్యం పంపిణీని ప్రారంభించక ముందే గంగాధర మండలం బూరుగుపల్లి రేషన్ డీలర్ గడ్డం సరోజ రేషన్ బియ్యం పంపిణీ చేసిందని, ప్రోటోకాల్ పాటించకపోవడంతో రెవెన్యూ అధికారులు ఆమెను తాత్కాలికంగా విధుల నుండి తొలగించి స్థానిక మహిళా సంఘం సభ్యులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
ఈనెల 1న బియ్యం పంపిణీ చేయాలని అధికారుల నుండి తమకు ఆదేశాలు ఉన్నాయని, ఆ ఆదేశాల మేరకే బియ్యం పంపిణీ చేసినట్లు రేషన్ డీలర్ తెలిపారు. ఈ నెల 1న 11:14 గంటలకు డిప్యూటీ తహసిల్దార్ వినయ్ రేషన్ డీలర్ల గ్రూపులో మెసేజ్ పెట్టారని, 2న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిన తర్వాతనే పంపిణీ చేయాలని చెప్పడంతో తాము పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశామని, కానీ అప్పటికే చాలామందికి బియ్యం అందించినట్లు తెలిపారు.
బియ్యం పంపిణీ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులను కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో వారి ఒత్తిడి మేరకే తనను విధుల నుంచి తొలగించినట్లు రేషన్ డీలర్ ఆరోపించారు. ఒకటో తేదినే తనతో పాటు మరో 25 మంది డీలర్లు బియ్యం పంపిణీ చేశారని, తన భర్త గడ్డం స్వామి బీఆర్ఎస్ కార్యకర్త కావడంతోనే స్థానిక కాంగ్రెస్ నాయకులు రెవెన్యూ అధికారులను ఒత్తిడి చేసి తనను విధుల నుంచి తొలగింపజేసినట్లు ఆరోపించారు.
బూరుగుపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ విచారణ చేసి తనకు నోటీసు ఇచ్చారని, తన తప్పిదాన్ని ఆ నోటీసులో పేర్కొనలేదని, అడిగితే తహసిల్దార్ కార్యాలయానికి రావాలని చెప్పాడని రేషన్ డీలర్ చెప్పారు. ఈ విషయంపై తహసిల్దార్ అనుపమను వివరణ కోరగా ఈనెల 2న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగపేట గ్రామంలో అధికారికంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాతనే మిగిలిన గ్రామాల్లో పంపిణీ చేయాలని ఆదేశించామని, ఇద్దరు రేషన్ డీలర్లు ప్రొటోకాల్ పాటించకుండా ముందే బియ్యం పంపిణీ చేయడంతో తాత్కాలికంగా వారిని తొలగించి, ఇతరులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.