విద్యాశాఖ మొద్దు నిద్ర పోతున్నది. ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే సంకల్పంతో తీసుకొచ్చిన ప్రతిష్ఠాత్మక ‘ఇన్స్పైర్’ మానక్’పై అంతులేని అలసత్వం చూపుతున్నది. శాస్త్ర సాంకేతిక రంగాలు, జీవకోటికి మేలు చేసే నూతన సాంకేతిక ఆవిష్కరణల దిశగా పిల్లలను ప్రోత్సహించాల్సి ఉన్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నది. ఇందుకు ఈ యేడు ‘ఇన్స్పైర్ మానక్’లో దాఖలైన నమూనాలే నిదర్శనంగా కనిపిస్తున్నది. జగిత్యాల జిల్లాలో గతేడాదితో పోల్చితే 400 ఎగ్జిబిట్లు తగ్గిపోవడం, ఈ యేడాది కేవలం 96 మాత్రమే ఎంట్రీ కావడం పరిస్థితికి అద్దంపడుతున్నది. ఇక ప్రైవేట్ విద్యాలయాలు, నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా నిలిచే గురుకులాలు, మోడల్ స్కూళ్ల నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఇన్స్పైర్ పూర్తిగా కళతప్పే పరిస్థితి కనిపిస్తుండగా, ఇప్పటికైనా యంత్రాంగం మేలు కోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
జగిత్యాల, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి, వారిలో వినూత్న ఆలోచనలకు పదును పెట్టి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సంకల్పించిన సృజనాత్మక, వైజ్ఞానికి కార్యక్రమమే ఇన్స్పైర్. దేశంలోని మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో 10 నుంచి 16 ఏండ్ల మధ్య వయసు ఉండి, 6 నుంచి 10వ తరగతి మధ్య చదివే విద్యార్థులందరూ అర్హులే.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల్లో ఏటా 10 లక్షల మందినైనా గుర్తించి వారిలో ఐదు లక్షల మందిలో శాస్త్ర సాంకేతిక రంగాలు, జీవకోటికి మేలు చేసే నూతన సాంకేతిక ఆవిష్కరణపై జిజ్ఞాస కలిగించాలన్న ఉద్దేశంతో (ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్) కొన్నేండ్ల క్రితం ప్రారంభమైంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇన్స్పైర్ మానక్ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. మానవాళి మనుగడకు, ప్రజల ప్రయోజనానికి సంబంధించిన ఎలాంటి ప్రయోగాన్నైనా విద్యార్థులు, గైడ్ టీచర్ సాయంతో రూపొందించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
యంత్ర నమూనా, పనితీరుపై నివేదిక కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. ఇలా పొందుపర్చిన వాటిని అధికారులు పరిశీలించి, అందులోంచి మెరుగైన వాటిని ఎంపిక చేసి, రాష్ట్ర, జాతీయ స్థాయికి పంపిస్తారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన నమూనాకు 10 వేలు, జాతీయ స్థాయికి ఎంపికైతే 25 వేల పారితోషికంతోపాటు బహుమతి అందజేస్తారు. అలాగే రాష్ట్రపతి భవన్లో బస చేయడంతోపాటు దేశానికి చెందిన దిగ్గజ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యే అవకాశం కల్పిస్తారు. బాల శాస్త్రవేత్తలుగా గుర్తింపును కల్పిస్తారు.
ఈ యేడాది అలసత్వం
గత విద్యా సంవత్సరాల్లో ఇన్స్పైర్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మంచి ఆదరణ కల్పించింది. అప్పటి ప్రభుత్వం బాలబాలికల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నించడం, అలాగే, విద్యాశాఖ అధికారులపై కచ్చితమైన పర్యవేక్షణ చేయడంతో మంచి ఫలితాలు నమోదవుతూ వచ్చాయి. జగిత్యాల జిల్లా నుంచి 2022-23 విద్యా సంవత్సరంలో 521 ప్రయోగ నమూనాలు ఆన్లైన్లో నమోదు కాగా, అందులో 67 నమూనాలు ఎంపికయ్యాయి.
4 రాష్ట్రస్థాయికి, ఒకటి జాతీయ స్థాయికి ఎంపికైంది. అలాగే 2023-24 విద్యా సంవత్సరంలోనూ 496 నమూనాలు నమోదు కాగా, అందులో 60 ఎంపికయ్యాయి. నాలుగు రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించగా, ఒకటి జాతీయ స్థాయికి సెలెక్ట్ అయింది. అయితే, ఈ యేడాది మాత్రం దారుణమైన పరిస్థితి కనిపిస్తున్నది. జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఇన్‌స్పైర్‌కు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులు, జిల్లా సైన్స్ టీచర్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఉత్తర్వులు పంపించారు.
జిల్లాలో మొత్తం 360కి పైగా ఉన్నత పాఠశాలల్లో 95,925 మంది విద్యార్థులు చదువుతున్నా.. ఇప్పటి వరకు కేవలం 96 నమూనాలు మా త్రమే నమోదయ్యాయి. అందులో 74 జడ్పీ స్కూల్ విద్యార్థుల నుంచి రాగా, 18 ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చాయి. ప్రైవేట్ స్కూళ్ల నుంచి కేవలం 4 మాత్రమే రాగా, మోడల్ స్కూల్స్, కస్తూ ర్బా, సోషల్, మైనార్టీ వెల్ఫేర్ గురుకులాల నుంచి ఇం త వరకు ఒక్కటంటే ఒక్క నమూనా ఆన్లైన్లో నమో దు కాలేదు. మరో పది రోజుల్లో దరఖాస్తుకు గడువు ముగియనున్నా పెద్దగా స్పందన కనిపించడం లేదు.
విద్యాశాఖపై విమర్శలు
వాస్తవానికి ప్రభుత్వం ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదు నమూనాలు దాఖలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో దాదాపు 1,795 నమూనాలు విద్యార్థులతో తయారు చేయించి ఆన్లైన్లో నమోదయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ, అమలులో విఫలం కావడానికి విద్యాశాఖ అధికారులు, టీచర్లు, హెచ్ఎంలే ప్రధాన కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు అధికారులైనా, ఇటు టీచర్లయినా అంకిత భావంతో పనిచేయకపోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టు తొలి వారం నుంచే జిల్లా విద్యాధికారి, సైన్స్టీచర్ ఇన్‌స్పైర్‌పై దృష్టిని సారించి, ప్రతి పాఠశాల హెచ్ఎంను మానిటరింగ్ చేస్తే, పరిస్థితి ఇలా ఉండేది కాదంటున్నారు.
ఇన్స్పైర్ విషయంలో విద్యాశాఖ అధికారులు చొరవ చూపాల్సిన అసరముందని సూచిస్తున్నారు. మరో ఆరు రోజులు గడువున్న నేపథ్యంలో అన్ని యాజమాన్యాల ఆధీనంలో ఉన్న ఉన్న త పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో సమావేశమై, ప్రతి పాఠశాల నుంచి కనీ సం మూడు నాలుగు నమునాలు వచ్చేలా చూడాలని, కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలంటున్నారు. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలాజీ టీచర్లతోనూ సమావేశమై విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై జిజ్ఞాస కలిగించేలా ఇన్స్పైర్ చేసేలా చూడాలని కోరుతున్నారు.